కియా మోటార్స్‌ ని ఏపీకి తెచ్చింది మోడీనే

ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్‌ ఇండియాలో భాగంగా కియా మోటార్స్‌  ను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కియా మోటార్స్‌ను కేంద్రం ఏపీకి ఇచ్చిందని మంత్రి నారా లోకేశ్‌ స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి కియోతో ఎటువంటి సంబంధం లేదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ చొరవతోనే ఏపీకి కియో పరిశ్రమ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 

పైగా, స్థానిక టీడీపీ నేతల అవినీతి వేధింపులు తట్టుకోలేక కియా మోటార్స్‌ వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు  ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవడంతో పరిస్థితి చక్కబడిందని కన్నా తెలిపారు. చెప్పుకోవడానికి ఏమీలేకే కేంద్రం చేసినవి సీఎం చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. 

 ప్రభుత్వ ఖర్చుతో  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. శోభన్‌బాబులా సోకులు చేస్తున్నారని జివిఎల్ ధ్వజమెత్తారు. ప్రతి పథకాన్ని చంద్రబాబు తన ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తానే చేశానని డబ్బాలు కొట్టుకుంటున్నారని కన్నా విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు విహారయాత్ర కేంద్రంగా మార్చారని ఈ సందర్భంగా కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సందర్శనకు ప్రజల సొమ్ముతో రైతులను తరలిస్తున్నారని మండిపడ్డారు. 

కాగా, ఎవరిని మోసం చేయడానికి చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారని కన్నా ప్రశ్నించారు. నాడు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది చంద్రబాబు కాదా అని నిలదీశారు. ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది చంద్రబాబేనని గుర్తుచేశారు.   

  ప్రభుత్వ పథకాలకు హెరిటేజ్ నుంచి డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని జివిఎల్ ఎద్దేవా చేశారు. ఢిల్లీకి రెండు పార్టీలను తీసుకెళ్లలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని చెబుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల ఖర్చుపై నిఘా పెడతామని హెచ్చరించారు. నాలుగున్నరేళ్లు జులాయిలాగా తిరిగిన చంద్రబాబు.. చివరి ఆరు నెలలు డబ్బుతో మేనేజ్‌ చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ప్యాకేజీలు ఇచ్చి తన పార్టీలోకి నేతలను తెచ్చుకుంటున్నారని ఆరోపించారు.  చంద్రబాబు చేసిన మోసం ప్రజలకు అందరికి తెలుసని చెప్పారు.