అసోం సీరియల్ పేలుళ్ల కేసులో బోడో నేతకు జీవితఖైదు

88 మందిని బలితీసుకున్న 2008 అసోం సీరియల్ పేలుళ్ల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది. నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎన్డీఎఫ్‌బీ) చీఫ్ రంజన్ డైమరీ సహా మరో తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో రెండు రోజుల క్రితమే మొత్తం 14 మందిని దోషులుగా నిర్దారించిన కోర్ట్ ఇవాళ వారికి శిక్షలు ఖరారు చేసింది. కోర్టు ఆవరణంలో పటిష్టమై బందోబస్తు మధ్య సీబీఐ న్యాయమూర్తి అపరేష్ చక్రవర్తి తీర్పు వెలువరించారు. 

డైమరీతో పాటు జార్జి బోడో, బి. తరై, రాజు శంకర్, అంచయ్ బోడో, ఇంద్ర బ్రహ్మ, లోకో బసుమతరి, ఖర్గేశ్వర్ బసుమతరి, అజయ్ బసుమతరి, రాజన్ గోయరి తదితరులు జీవిత ఖైదు పడిన వారిలో ఉన్నారు. మరో ముగ్గురు దోషులు ప్రభాత్ బోడో, జయంతి బసుమతరి, మధుర బ్రహ్మలు కోర్టు విధించిన జరిమాన చెల్లించిన తర్వాత విడుదల కానున్నారు.

నీలిమ్ డైమరీ, మృదుల్ గోయరి ఇప్పటికే శిక్ష అనుభవించినందున వారిని విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కాగా ఎన్డీఎఫ్‌బీ చీఫ్ డైమరీని దోషిగా గుర్తించి అరెస్ట్ చేయడంతో ఆయన బెయిల్ రద్దు కాగా... మరో 14 మంది ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నారు. 2008 అక్టోబర్ 30న ఎన్డీఎఫ్‌బీ మొత్తం 9 చోట్ల వరుస పేలుళ్లకు పాల్పడింది. ఈ దాడుల్లో 88 మంది ప్రాణాలు కోల్పోగా, 540 మంది గాయపడ్డారు.