కియా మోటార్స్ తెచ్చింది మోదీ...షోకులు అన్ని చంద్రబాబువి !

  అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద ఏర్పాటు చేసిన కియా కార్ల పరిశ్రమలో ప్రయోగాత్మక ఉత్పత్తి ఆరంభ వేడుక మంగళవారం ఘనంగా జరగడం సంతోషం. వెనుకబడిన రాయలసీమలో స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్లకు ఒక భారీ పరిశ్రమ ఏర్పడటం ఆనందదాయకం. అయితే ఇదంతా తన వ్యక్తిగత శ్రమ ఫలితం అని, తన ఘనకార్యం అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకోవడం వెగటు కలిగిస్తుంది. ఉన్నత పదవులలో ఉన్నవారిలో హుందాతనం ఉండాలి. తమకు తామే సొంత డబ్బా కొట్టుకొంటూ ఉంటె వెగటు కలిగిస్తుంది. 

ఈ ఫ్యాక్టరీ ఇక్కడకు రావడానికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఈ విషయమై గతంలో చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రధానిని కలిసి కృతజ్ఞతలు కూడా చెప్పారు. మధ్యలో ఆయన పార్టీ నేతలు ఫ్యాక్టరీ పనులు ప్రారంభం కాకుండానే ముడుపుల కోసం వేధిస్తూ ఉంటె భయపడి ఇక్కడి నుండి పారిపోయే ప్రయత్నం కొరియా కంపెనీ చేసింది. అప్పుడు కూడా ప్రధాని కార్యాలయం అడ్డుపడి సర్ది చెప్పింది. కానీ ఇప్పుడు అంతా తనను చూసే ఈ ఫ్యాక్టరీ ఇక్కడకు వచ్చినదని పచ్చి అబద్దాలు చెబుతున్నారు. చివరకు ఆ కంపెనీ చైర్మన్ ను కలవడానికి కూడా చంద్రబాబుకు ప్రధాని కార్యాలయం సహాయం చేసిన విషయాన్నీ మరచి పోతున్నారు. 

2015 లో ప్రధాని మోదీ దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళినప్పుడు స్వయంగా శాంసంగ్ ,ఎల్జీ , హ్యుందాయ్ కార్పొరేషన్ చైర్మన్ లను కలిశారు. ఆ సందర్భంలో హ్యుందాయ్ చైర్మన్ తమ అనుబంధ సంస్థ ' కియా ' మోటార్స్ ను భారత్ లో స్థాపించాలి అని అభిలాష వ్యక్తం చేశారు..హ్యుందాయ్ ఫ్యాక్టరీ తమిళనాడు లో ఉన్నందున అక్కడనే దీనిని కూడా ప్రారంభించాలి అనుకొంటున్నట్లు తెలిపారు. 

అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్న ప్రధాని ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారిని ప్రోత్సహించారు. తమిళనాడు పొరుగునే ఉంటుంది పైగా మీకు రాయితీలు అధికంగా వచ్చే ఏర్పాటు చేస్తాను అని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల తన హామీలను గుర్తు పెట్టుకొనే ఈ కియా మోటార్స్ ను రాష్ట్రానికి వచ్చేటట్లు చేశారు. 

ఈ విషయం తండ్రిలాగా ఇంకా క్షుద్ర రాజకీయం తెలియని నారా లోకేష్ సహితం అప్పట్లో పత్రికల వారితో చెప్పారు కూడా. ఈ విషయంలో గుజరాత్ కు ఈ ప్లంట్ ను ఎగరవేసుకు పోయే ప్రయత్నం చేశారని టిడిపి నేతలు అభాండాలు కూడా వేస్తున్నారు. ప్రధానిని కాదని, ఏ మాత్రం తెలియని ఒక ముఖ్యమంత్రిని చూసి ఇంత భారీ ఫ్యాక్టరీ పెట్టడానికి మొగ్గు చూపుతారని ఎవ్వరైనా నమ్ముతారా ?

మే, 2015లో కొరియా పర్యటనకు వచ్చిన భారత ప్రధాని మోదీని కలసి నప్పుడు తమ రెండో ప్లాంట్ అక్కడ నెలకొల్పడం పట్ల ఆసక్తి చూపున్నట్లు  స్వయంగా హ్యుందాయ్ మోటార్ చైర్మన్ చుంగ్ మోంగ్-కూ చెప్పిన్నట్లు `బిజినెస్ కొరియా' అని పత్రిక రెండేళ్ల క్రితమే ఒక కధనాన్ని ప్రచురించింది. పైగా అనంతపూర్ లో ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా సంకేతం ఇచ్చారు. 

ఇక్కడ మరో గందరగోళం జరిగింది. ఫ్యాక్టరీ శంఖుస్థాపన జరగగానే టిడిపి ఎంపీ ఒకరు, రాష్ట్ర మంత్రి మరొకరు తమ కమీషన్ల కోసం, డీలర్ షిప్పుల కోసం కంపెనీ ఎండీ ని ముప్పతిప్పలు పెట్టడం మొదలెట్టారు. వీళ్ళ బాధ తట్టుకోలేక ఇండియా ఎండీ కంపెనీ చైర్మన్ కు మెయిల్ పెట్టారు. ఇక్కడ ఆంధ్రాలో మనం ప్లాంట్ పెట్టి వ్యాపారం చేయలేము ఇక్కడ అవినీతి రౌడీ ఇజం రాజ్యమేలుతున్నాయి అని తెలిపారు. 

దానితో వెంటనే కంపెనీ చైర్మన్ చుంగ్ మాంగ్ కో ప్లాంట్ పనులు ఆపేసి  సియోల్ ( కంపెనీ హెడ్ క్వార్టర్స్) రమ్మని ఆదేశాలు ఇచ్చారు. అప్పుడు ఆంద్రప్రదేశ్  పరిశ్రమల కార్యదర్శి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడితే తాము ఇక్కడ ప్లాంట్ పెట్టలేమని, తమకు భద్రతలేదని స్పష్టం చేశారు.  పైగా అంత అవినీతి వత్తిడితో తాము వ్యాపారం చేయలేమని వెల్లడించారు. ఆపై ఏమి చెయ్యాలో నేరుగా ప్రధాని కార్యాలయంతో మాట్లాడతాము అని స్పష్టం చేశారు..

విషయం అర్ధం చేసుకున్న  చంద్రబాబుకు ముచ్చెమటలు పోయసాయి.  ప్లాంట్ పొతే తన పరువు పోతుందని ఖంగారు పడ్డారు.  వెంటనే రంగంలోకి దిగి హుటాహుటిన అప్పట్లో  దక్షిణ కొరియా పర్యటన పెట్టుకొన్నారు. కంపెనీ చైర్మన్ తో ప్రధాని కార్యాలయం ద్వారా అపాయింట్ మెంట్ ఇప్పించుకొని కలిశారు. ఇకపై పొరపాటు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి  వచ్చారు. మళ్ళీ ప్లాంట్ పనులు ప్రారంభం చేస్తామని వాళ్ళదగ్గర మాట తీసుకొని భారత్ వచ్చి ప్రధానికి కృతజ్ఞతలు చెప్పారు.

కియా మోటార్స్ విషయంలో ప్రధాని ఇంత సహాయం చేస్తే ఈరోజు ఇదంతా తన ఘనకార్యంగా చెప్పుకోవడం విడ్డూరంగానే ఉంది. వాస్తవానికి చంద్రబాబును నమ్ముకొంటే కంపెనీ వారు ఎప్పుడో పారిపోయి ఉండేవారు. ప్రధాని జోక్యం వల్లననే అది అక్కడ కార్యరూపం దాల్చింది. వాస్తవాలను మరిచిపోవడం, సహాయం చేసిన వారిని దూషించడం ప్రజా జీవనంలో ఎవ్వరికీ మేలు కలిగించదు. ఈ రోజు కాకపోయినా రేపయినా ప్రజలకు వాస్తవాలు తెలియక మానవు.