చంద్రబాబు అవినీతిపై హైకోర్టు లో కన్నా పిల్

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతి చర్యలపై సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) రమేశ్‌ అభ్యర్థన మేరకు విచారణను వాయిదా వేస్తూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే విధంగా పలు జీవోలు జారీచేసిందని, ఈ వ్యవహారంలో సీఎం పాత్రపై సీబీఐ లేదా తగిన స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని అందులో కన్నా కోరారు.

‘అక్రమాలకు పాల్పడి సీఎం, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు సంపద కూడబెట్టారు. అక్రమాలపై ముఖ్యమంత్రికి లేఖ రాశాను. రాష్ట్రపతి, గవర్నర్‌, కేంద్ర హోంశాఖకు వినతులు సమర్పించాను. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు ప్రారంభించలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా సీఎం తన అనుచరులకు అధిక ధరలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు’ అంటూ వివిధ అంశాలను పేర్కొన్నారు.
*ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ.131 కోట్ల ఆర్థిక నష్టం కలిగేలా బెంగళూరుకు చెందిన రేచమ్‌ ఆర్‌పీడీ ప్రైవేటు లిమిటెడ్‌కు కాంట్రాక్టు అప్పగించారు.
*హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంస్థకు రూ.700 కోట్ల విలువ చేసే 48 ఎకరాల్ని కేటాయించారు. ఆ సంస్థకు రూ.2,223 కోట్ల మేరకు ప్రయోజనం కల్పించారు.
*విశాఖ జిల్లా మధురవాడలో ఖరీదైన 50 ఎకరాల భూమిని ‘ఈ సెంట్రిక్‌ సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’కు రూ.25 కోట్లకు కేటాయించారు. ఆ సంస్థ డైరెక్టర్‌ శ్రీధర్‌రాజు సీఎం తనయుడి స్నేహితుడు కావడంతో ఆ భూమి కేటాయించారు.
*హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ బంధువులకు జగ్గయ్యపేట మండలం జయతిపురంలో యూరియా ప్లాంట్‌ ఏర్పాటు నిమిత్తం 498 ఎకరాల్ని వీబీసీ ఫర్టిలైజర్స్‌, కెమికల్స్‌ లిమిటెడ్‌కు కేటాయించారు.
*సీఎం, మంత్రి లోకేశ్‌ ఆదేశాలతో రూ.2,000 కోట్ల ఆస్తులు కలిగిన ‘విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌స్‌’ను  ప్రైవేటు సంస్థలో విలీనం చేశారు.
*అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే సీఎం సలహామేరకు ముఖ్యమంత్రి, మంత్రుల బినామీలు అమరావతిలో భూములు కొనుగోలు చేశారు.
*ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం అమలులో రాష్ట్రంలో భారీ కుంభకోణం జరిగింది.
*భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సంబంధించి ‘ఎయిర్‌ పోర్ట్‌ అథార్టీ ఆఫ్‌ ఇండియా’ టెండర్‌ను రద్దు చేసి, ప్రైవేటు బిడ్డర్‌కు అప్పగించాలని చూస్తున్నారు. 

కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్‌, సీబీఐ డైరెక్టర్‌, ఏపీఐఐసీ, ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీఈపీడీసీఎల్‌ ఛైర్మన్‌ హెచ్‌వై దొర, రేచమ్‌ ఆర్‌పీడీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ, వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును వ్యాజ్యంలో ప్రతివాదుల జాబితాలో చేర్చారు.