బెంగాల్ లో బిజెపి కార్యకర్తల వాహనం ధ్వంసం

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లా కాంతి పట్టణంలో మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సభ ముగిసిన వెంటనే గుర్తు తెలియని ఆగంతకులు బీజేపీ శ్రేణుల వాహనాలను ధ్వంసం చేశారు.ఈ ఘటనకు అధికార తృణమూల్ కాంగ్రెస్‌దే బాధ్యత అని బీజేపీ ఆరోపించింది. 

కాంతిలోని తమ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో ఆగ్రహించిన కార్యకర్తలు ప్రతీకారం తీర్చుకున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. తమ కార్యకర్తలపై తృణమూల్ కార్యకర్తలు దాడికి పాల్పడటం సిగ్గుచేటని బీజేపీ పశ్చిమ బెంగాల్‌శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. తమ బలం చూసి తృణమూల్ భయపడుతున్నదని బీజేపీ జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా తెలిపారు. 

బీజేపీ సీనియర్ నేత కైలాశ్ వర్గియ స్పందిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అంతకుముందు జరిగిన బహిరంగ సభలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయాలని పిలుపిచ్చారు. 

పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య తేడా ఏమీ లేదని, ఈ పార్టీలు బొమ్మ, బొరుసులాంటివని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌లుకుటుంబ పార్టీలని, ప్రజాస్వామ్యం లేదని ఆయన ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ లో ఒక గాంధీ తర్వాత మరో గాంధీ నాయకత్వంపై వస్తూ ఉంటె పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తర్వాత ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎదుగుతున్నారని చెప్పారు.

వారసత్వ రాజకీయాల వల్ల దేశం దెబ్బతింటుందని అమిత్ షా హెచ్చరించారు. కేంద్రం, రాష్ట్రాల్లో బలమైన ప్రభుత్వం ఉండాలని చెబుతూ దేశానికి లీడర్లు కావాలని, అంతేకాని డీలర్లు కాదని స్పష్టం చేశారు.