డిఎంకె అద్యక్షుడిగా స్టాలిన్ ఎన్నిక

డీఎంకే నూతన అధ్యక్షుడుగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను పార్టీ ప్రధాన కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. 70ఏళ్ల డీఎంకే చరిత్రలో మూడోసారి అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగింది. అన్నాదురై, కరుణానిధి అనంతరం స్టాలిన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం విశేషం.  

ఇక పార్టీ కోశాధికారిగా దురైమురుగన్ ఎన్నికయ్యారు. మరోవైపు డీఎంకే నూతన అధ్యక్షుడిగా స్టాలిన్ ఎన్నిక కావడంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. 

సుమారు అర్ధ శతాబ్ది కాలం పాటు పార్టి అద్యక్షుడిగా కొనసాగిన కరుణానిధి ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. తొలి నుండి డిఎంకె లో క్రియాశీలకంగా పనిచేస్తున్న స్టాలిన్ తండ్రి అనారోగ్యానికి గురైనప్పటి నుండి పార్టీ కార్యనిర్వాహక అద్యక్షుడి హోదాలో మొత్తం పార్టీ వ్యవహారాలపై వ్యూహాత్మకంగా పట్టు సాధించారు. తండ్రి ఇంటికే పరిమితం అవుతూ రావడంతో పార్టీలో బలమైన నేతగా, తండ్రికి రాజకీయ వారసుడిగా పార్టీ శ్రేణుల అందరి విశ్వాసాన్ని చూరగొన గలిగారు. పార్టీలో సీనియర్ నేతలు అందరు ఆయన వెంటనే ఉన్నారు.

కరుణానిధికి స్టాలిన్‌ మూడో కుమారుడు. 1953 మార్చి 1న మద్రాసులో జన్మించారు. ఈయన పుట్టిన నాలుగు రోజుల తర్వాతే రష్యా అధ్యక్షుడు స్టాలిన్‌ మరణించారు. వామపక్ష భావాలపై ఉన్న మమకారంతో కరుణానిధి తన తనయుడికి స్టాలిన్‌ అని పేరు పెట్టారు. స్టాలిన్‌ చిన్నప్పటి నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 14ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టి 1967 ఎన్నికల్లో తండ్రి తరఫున ప్రచారం చేశారు. 1973లో డీఎంకే జనరల్‌ కమిటీకి స్టాలిన్‌ ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన జైలుకెళ్లడంతో స్టాలిన్‌ పేరు వార్తల్లో నిలిచింది. తమిళనాడు అసెంబ్లీని స్టాలిన్ నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.

పార్టీలో వారసత్వం పై సందిగ్తను తొలగించేందుకు 2013 జనవరిలోనే తన వారసుడిగా స్టాలిన్ ను కరుణానిధి ప్రకటించారు. గత సంవత్సరం పార్టీ కార్యనిర్వాహక అద్యక్ష పదవి చేపట్టారు. ప్రస్తుతం శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.

తండ్రి మృతి అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టేందుకు స్టాలిన్‌పై ఆయన సోదరుడు అళ‌గిరి తిరుగుబాటు ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు తన వెంటే ఉన్నారన్న ఆయన అధ్యక్ష పదవికి అర్హుడినని చెప్పుకొచ్చారు. అయితే స్టాలిన్ మాత్రం సోదరుడి హెచ్చరికను ఏమాత్రం ఖాతరు చేయలేదు. పార్టీలో విభేదాలపై మౌనం వహించిన ఆయన పార్టీ అద్యక్షుడిగా ఎన్నికయ్యారు.