ఒవైసీ కేసు దర్యాప్తుకు ఢిల్లీ కోర్టు ఆదేశం

హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు, ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్టీ అధినేత, అసదుద్దీన్ ఒవైసీ 2014లో చేసిన ద్వేషపూరిత ప్రసంగంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేయాలని ఢిల్లీలోని కర్కర్ దూమా కోర్టు మంగళవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది.

 2014లో అసదుద్దీన్ చేసిన ద్వేషపూరిత ప్రసంగం వల్ల రెండు మతాల మధ్య శత్రుత్వం పెరిగి ఘర్షణలు జరిగే ప్రమాదముందని ఢిల్లీకి చెందిన అజయ్ గౌతం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో సరైన ఆధారాలు దొరకలేదని మూసివేశారు. దీనిపై అజయ్ గౌతం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ పోలీసులు ఒవైసీపై మూడేళ్లుగా సరిగా విచారణ జరపలేదని, కనీసం అతని వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయలేదని, రాజకీయ పలుకుబడి వల్లనే అతనిపై కేసు ఎత్తేశారని అజయ్ కోర్టును ఆశ్రయించారు.

దీంతో అసదుద్దీన్ ఒవైసీ చేసిన ద్వేషపూరిత ప్రసంగంపై ఐపీసీ 120 బి, 153 ఏ, 504, 66 ఏ, 66ఎఫ్, 67 ఐటీయాక్టుల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి కోర్టు విచారణ మార్చి 26వతేదీ ఉంటుందని కోర్టు పేర్కొంది.