పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకండి

పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావొద్దని, పరీక్షలే జీవితం కాదని ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు వారి కలల్ని పిల్లలు నెరవేర్చాలని అనుకోవద్దని తెలిపారు. మోదీ ఈరోజు పరీక్ష పే చర్చా కార్యక్రమం ద్వారా రెండోసారి విద్యార్థులతో సమావేశమయ్యారు. పదవ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలు మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల ఒత్తిడిని ఎలా జయించవచ్చో కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నం చేశారు. 

దిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో  దాదాపు రెండు వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులతో పరీక్షలు, తదితర అంశాలపై మాట్లాడారు. గత ఏడాది కేవలం దిల్లీ, ఎన్సీఆర్‌ ప్రాంతాల్లోని విద్యార్థులే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఈసారి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు రష్యా, నేపాల్‌, నైజీరియా, ఇరాన్‌, దోహా, కువైట్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌లలో చదువుతున్న పలువురు భారతీయ  విద్యార్థులు కూడా వచ్చారు.

పరీక్షలు ముఖ్యమైనవి కానీ.. అవి మన జీవితానికే పరీక్షలు కావని, అవి జీవితాలను ఆపవని ప్రదాని హితవు చెప్పారు. తల్లిదండ్రులు వారి కలల్ని పిల్లలపై రుద్దొద్దని సూచించారు. తమ కలలు పిల్లలు నెరవేర్చాలని అనుకోవడంతో చిన్నారులపై భారం పెరుగుతుందని, అలా చేయకూడదని సూచించారు. పిల్లలు విఫలమైనప్పుడు కూడా తల్లిదండ్రులు చిన్నారుల వెన్ను తట్టి ప్రోత్సహించాలని తెలిపారు.

తన కొడుకు ఆన్‌లైన్‌ గేమ్స్‌పై చాలా ఆసక్తి చూపుతున్నాడని, ఏం చేయాలని ఓ తల్లి మోదీని ప్రశ్నించగా.. అది పబ్జి నా అని మోదీ అడిగారు.  సాంకేతిక వల్ల లాభాలూ ఉన్నా నష్టాలు కూడా ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు దగ్గరుండి సాంకేతికత  సాయంతో కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు.

మీరు లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం  క్షమార్హం.. కానీ మీ లక్ష్యం చిన్నదైతే మాత్రం అది క్షమార్హం కాదని మోదీ వెల్లడించారు. మీరు రోజుకు 17 గంటలు పనిచేయడానికి ఏం అంశం మిమ్మల్ని ప్రోత్సహిస్తోందని ఓ విద్యార్థిని మోదీని ప్రశ్నించగా.. ఓ తల్లి కుటుంబం కోసం 24 గంటలు శ్రమించినట్లుగానే, నేను నా 1.25కోట్ల భారతీయ కుటుంబం కోసం శ్రమిస్తున్నానని సమాధానమిచ్చారు.

రోజులోని 24 గంటలు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలని మోదీ విద్యార్థులకు సూచించారు. సమయం సద్వినియోగం చేసుకోవడానికి ఎంబీఏలు అవసరం లేదని అన్నారు.