సిద్దరామయ్య చేతిలో ఓ మహిళా చున్నీ రేపిన దుమారం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య బహిరంగ ప్రదేశంలో, పలువురు చూస్తూ ఉండగానే ఓ మహిళ విషయంలో ప్రవర్తించిన తీరుపై తీవ్ర వివాదం రేపింది. ఆయనను నిలదీస్తూ మాట్లాడిన ఓ మహిళా చేతిలో నుండి ఆయన బలవంతంగా మైక్ లాక్కోవడంతో, ఆమె చున్నీ కూడా అయన చేతిలోకి చేరడంతో దుమారం చెలరేగింది.ఆయనపై వెంటనే కేసు నమోదు చేసి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ కర్ణాటక పోలీసులను కోరింది.

మైసూరులో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఆయన ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు కనిపిస్తున్న వీడియోను అంతర్జాలంలో చూసినవారంతా మహిళలకు కాంగ్రెస్ ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు.

జమీలా అనే మహిళ ఓ గ్రామ నాయకురాలు, కాంగ్రెస్ కార్యకర్త అని తెలుస్తోంది. ఆమె మైసూరులో జరిగిన కార్యక్రమంలో సిద్ధరామయ్యను నిలదీశారు. సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. యతీంద్ర ఎమ్మెల్యే అయిన తర్వాత తమకు అందుబాటులో ఉండటం లేదని జమీలా ఆరోపించడంతో సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

ఆమె చేతిలోని మైకును లాక్కున్నారు. ఆ సమయంలో ఆమె ధరించిన చున్నీ కూడా ఆయన చేతిలోకి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆమె వాదిస్తూ ఉండటంతో ఆమెను గట్టిగా గద్దించి, కూర్చోబెట్టేందుకు సిద్ధరామయ్య ప్రయత్నించారు. మైక్‌ లాక్కొన్న తర్వాత కూడా జరిగిన తప్పిదాన్ని గ్రహించకుండా, వెంటనే ఆమెను అక్కడి నుంచి వెళ్లిపొమ్మంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. మహిళల పట్ల కాంగ్రెస్ సంస్కృతి ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు.

మరో వైపు జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. కమిషన్ చైర్‌పర్సన్ రేఖ శర్మ ఓ ట్వీట్‌లో ఈ అంశాన్ని విచారణకు చేపట్టామని పేర్కొన్నారు. ఈ సంఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కర్ణాటక పోలీసులకు లేఖ రాస్తామని తెలిపారు.