రచ్చకెక్కిన కర్ణాటక సంకీర్ణంలో కుమ్ములాటలు.. సీఎం రాజీనామా బెదిరింపు

కర్ణాటక సంకీర్ణంలో కుమ్ములాటలు రచ్చకెక్కాయి. `తమ ముఖ్యమంత్రి సిద్దరామయ్య' అంటూ, `ప్రస్తుత ప్రభుత్వంలో పనులు ఏమీ జరగడం లేదు' అంటూ కొందరు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు, మంత్రులు సిద్దరామయ్య సంఖ్యంలోనే ఒక సభలో పేర్కొనడం సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మధ్య అగ్గి రాజేసింది. కాంగ్రెస్‌ ఎమ్యెల్యేలు హద్దు తాటుతున్నారని, వారిని అదుపులో పెట్టుకోవాలని ముఖ్యమంత్రి  కుమారస్వామి హెచ్చరిక చేశారు. లేని పక్షంలో తాను ముఖ్యమంత్రి  పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని బెదిరించారు.

తాను కాంగ్రెస్ నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నామని ఇదివరలో ఒక సారి ముఖ్యమంత్రి పార్టీ ఎమ్యెల్యేల సమావేశంలో కంటనీరు పెట్టుకోవడం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి మూళ్ళ కుర్చీ వలే ఉన్నట్లు మరోమారు చెప్పారు. దానితో లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో చీలికలకు దారితీసే పరిణామాలు చోటుచేసుకోవడంపై కాంగ్రెస్ అధిష్ఠానంకు ఆందోళన కలిగిస్తున్నది.

తనను అగౌరవపరిస్తే తనకొచ్చే నష్టం ఏమీలేదని, కాంగ్రెస్‌కే నష్టమని కుండబద్ధలు కొట్టారు. సిద్ధరామయ్యే తమ నాయకుడంటూ పదేపదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతూ అన్ని హద్దులూ అతిక్రమిస్తున్నారని మండిపడ్డారు

కాంగ్రెస్‌ నేత,  మంత్రి సి.పుట్టరంగ శెట్టి ఆదివారం ఒక సభలో తనకు మాత్రం ఇంకా సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రి అని చెప్పుకొచ్చారు. సిద్ధరామయ్య మరో ఐదేళ్లు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని మరో కాంగ్రెస్‌ నేత ఎస్‌టీ సోమశేఖర్‌ అదే సభలో చెప్పారు. సిద్ధరామయ్య కూడా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాజకీయ ప్రత్యర్థులు తనను గెలవకుండా చేశారని, తాను మరో పర్యాయం అధికారంలోకి వచ్చి ఉంటే ఎన్నో అభివృద్ధి పనులు పూర్తిచేసేవాడినని చెప్పుకొచ్చారు.

ఇలాంటి వ్యాఖ్యల పట్ల కుమారస్వామి ఆగ్రహంగా ఉన్నారు. కాగా కుమారస్వామి తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడ మాత్రం సంకీర్ణ ప్రభుత్వంలో ఇలాంటివి సాధారణమేనని, దీనిపై తాను స్పందించాల్సిన అవసరం లేదని దాటవేసే ప్రయత్నం చేశారు. ఇటీవల కర్ణాటకలో ఎమ్మెల్యేల అదృశ్యం, రిసార్టు రాజకీయలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

సీఎం పదవిని వదులుకునేందుకు సిద్ధమేనని కుమారస్వామి చేసిన హెచ్చరికలను కాంగ్రెస్ సీరియస్‌గా పరిగణించింది. కుమారస్వామికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఎస్‌టీ సోమశేఖర్‌కు నోటీసులు జారీ చేయాలని కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ రాష్ట్ర కాంగ్రెస్‌ను ఆదేశించారు. సోమశేఖర్ వ్యాఖ్యలపై వివరణ కోరాలని వేణుగోపాల్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

అయితే ఉపముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత డా. జి పరమేశ్వర మాత్రం తమ అందరికి ముఖ్యమంత్రిపై నమ్మకమున్నదని స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామితో మేమంతా సంతోషంగానే ఉన్నామని పరమేశ్వర పేర్కొన్నారు.అయితే సిద్దరామయ్య తమ సీఎల్పీ నాయకుడు అని,  తమ  పార్టీ ఎమ్మెల్యేలకు ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. వాళ్లు అలా చెప్పుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు.

మొన్నటి వరకు తమ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బిజెపి తమ ఎమ్యెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు ఆరోపించిన కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు ఇప్పుడు కుమారస్వామి ప్రభుత్వానికి అసలైన ముప్పు సిద్దరామయ్య నుండే ఉన్నట్లు పరోక్షంగా అంగీకరిస్తున్నారు.