బీసీలపై వరాల జల్లు కురిపించిన చంద్రబాబు

తెలుగు దేశం పార్టీ రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘జయహో బీసీ’ సదస్సులో వెనకబడిన తరగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాలవర్షం కురిపించారు. బీసీల్లోని మెజార్టీ వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రస్తుతం ఉన్న ఫెడరేషన్లను కూడా కార్పొరేషన్లుగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక తీరునే.. బీసీ ఉప ప్రణాళికకు కూడా చట్టబద్దత కల్పిస్తామని స్పష్టం చేశారు. అత్యంత వెనకబడిన వర్గాలకు చెందిన కుటుంబాలకు నెలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించారు.

నాయీ బ్రాహ్మణుల సెలూన్లు, స్వర్ణకారులు, చేనేత వృత్తి చేసే వారిని కూడా ఈ పథకం పరిధిలోకి తేవడం ద్వారా భారీ ప్రయోజనం కల్పించబోతున్నారు. విదేశీ విద్యకు ఇచ్చే మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు  చేయడంతోపాటు రాజధానిలో పదెకరాల్లో రూ.100 కోట్లతో మహాత్మా జ్యోతిబా పూలే స్మారక భవన నిర్మాణం చేపట్టబోతున్నారు. వచ్చే బడ్జెట్ లో అందుకోసం రూ.3వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారు. 

యాదవ, తూర్పుకాపు, చేనేత, మత్స్యకారులు, శెట్టి బలిజ-గౌడ-ఈడిగ-శ్రీశయన, కళింగ, కొప్పు వెలమ, కురుబ, గవర, చేనేత(పద్మశాలి), అగ్నికుల క్షత్రియ, గాండ్ల, వన్నెకుల క్షత్రియ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తామన్నారు. రజక, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, సగర/ఉప్పర, మేదర, కల్లుగీత, కృష్ణబలిజ/పూసల, వాల్మీకి/బోయ, భట్రాజ, శాలివాహన, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్లు కార్పొరేషన్లుగా మార్చుతారు. రూ.100 కోట్లతో అమరావతిలో పదెకరాల్లో మహాత్మా జ్యోతిబా పూలే స్మారక భవనం నిర్మాణం, పూలే విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేస్తారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమరావతిలో డోలు, నాదస్వరం, సంప్రదాయ సంగీతాలకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు. అన్ని సంగీత పాఠశాలల్లో వీటిని నేర్పేలా చర్యలు తీసుకొంటారు. శాలివాహన కులవినతి మేరకు అమరావతిలో మొల్లమాంబ విగ్రహం ఏర్పాటు చేస్తారు.

 ఎంబీసీల గృహాలకు 100 యూనిట్లు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు 150 యూనిట్లు,  చేనేత వృత్తి చేసే కార్మికులకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 00 యూనిట్లు చొప్పున ఉచిత విద్యుత్ అందజేస్తారు. స్వయం ఉపాధి పథకాలకు వయో పరిమితి 50 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతారు. పారిశ్రామికవాడల్లో 25 శాతం ప్లాట్లు ఏపీఐఐసీ ద్వారా బీసీలకు కేటాయింపు, అందులో 1/3వ వంతు మహిళలకే చేస్తారు.  ట్యాక్సీలు, క్యాబ్‌ తదితర రవాణా వాహనాలపై బీసీలకు 25 శాతం రాయితీ కోసం ఏడాదికి రూ.9 కోట్ల ఖర్చు చేస్తారు. గొర్రెలకు ఉచిత బీమా కల్పిస్తూ ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ గురుకుల పాఠశాల చొప్పున ఇప్పటికే ఉన్న 106 పాఠశాలలకు అదనంగా 69 ఏర్పాటు చేస్తారు.  విదేశీవిద్య ఆర్థిక సాయం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచుతారు. బీసీల్లో కేటగిరీ మార్పుల అభ్యర్థనలు బీసీ కమిషన్‌కు సిఫారసు చేస్తారు. వాల్మీకి, బోయలు, వడ్డెరలను ఎస్టీల జాబితాలో చేర్చడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తారు. రజకులను ఎస్సీల్లో చేర్చడానికి ప్రయత్నం చేస్తారు.