చంద్రబాబు బిసిని సీఎం చేయగలరా !

తనకు బీసీల బ్యాక్‌ బోన్‌ అంటూ పదే పదే చెప్పుకునే చంద్రబాబు నాయుడు  అటువంటి బీసీలను ముఖ్యమంత్రి చేయగలరా అంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సవాల్ విసిరారు. బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీని ప‍్రధానిగా చేసిన ఘనత బీజేపీదని గుర్తు చేశారు. రాష్ట్ర పర్యటనలో చంద‍్రబాబు, బాలకృష్ణలు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించడాన్ని తప్పుబట్టారు. ఒక బీసీ వర్గానికి చెందిన మోదీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేయడం టీడీపీ పెద్దలకు ఎంతమాత్రం తగదని హితవు చెప్పారు.

తాత్కాలిక అమరావతిని చూపించడానికి డబ్బులు ఖర్చు పెట్టి బొమ‍్మలు చూపిస్తున్నారని ఆరోపించారు. బాబు బస్సు యాత్రలతో ఆర్టీసీ దివాలా తీసే పరిస్థితి ఉందనే విషయం గుర్తించాలని ధ్వజమెత్తారు. 600 నుంచి 1000 బస్సుల వరకూ మీ యాత్రకు ఉపయోగిస్తే ప్రజలు అసౌకర్యానికి గురవుతారన్నారని విమర్శించారు. స్కూల్‌ విద్యార్థులకు మేలో యూనిఫామ్‌లు ఇవ్వాల్సి ఉన్నా,  ఇప్పటికీ యూనిఫామ్‌ కుట్టినవారికి బిల్లులు ఇవ్వలేదని విమర్శించారు. మరి అటువంటప్పుడు డ్వాక్రా మహిళలకు సెల్‌ఫోన్లు ఇస్తానంటూ ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారని నిలదీశారు.  

పోలవరం కట్టలేక చంద్రబాబు తాళ్లపూడి, పుష్కరం ఎత్తిపోతలు కట్టారని, పోలవరంను దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ప్రారంభించారని స్పష్టం చేశారు. పోలవరం లో జరిగిన పనులకు ఆధారాలు ఉన్నాయని, కేంద్రం ఏడు వేల కోట్లు ఇస్తే ఇప్పుడు నీకు నైతిక హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. ‘ఏదైన చంద్రబాబు నేనే ఇచ్చాను అంటాడు. డ్వాక్రా నేనే ఇచ్చానంటావ్. డ్వాక్రాను వాజ్‌పేయి ఇచ్చారు. ప్రపంచంలో ఎవరూ ఏమి ఇచ్చినా నేనే ఇచ్చానంటూ డబ్బా కొట్టుకుంటావ్’ అంటూ బాబుపై వీర్రాజు నిప్పులు చెరిగారు.