31 నుంచి పార్లమెంటు సమావేశాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆఖరు పార్లమెంటు సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 13తో ముగుస్తాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.

రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 31వ తేదీ ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యుల సంయుక్త సమావేశంలో ప్రసంగించడంతో పార్లమెంటు మధ్యంతర బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. అరుణ్ జైట్లీ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లినందున కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2019-20 వార్షిక  సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు.

మోదీ ప్రభుత్వం ఫిబ్రవరి 1న ఆనవాయితీ ప్రకారం ఓట్ ఆన్ అకౌంట్ ఇంటరిం బడ్జెట్‌ను ప్రతిపాదిస్తుందా? కొత్త పథకాలు,  విధాన నిర్ణయాలతో కూడిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రతిపాదిస్తుందా? అనేది ఇంకా స్పష్టం కావటం లేదు.