వాచ్‌మాన్‌ను తొలిగించేందుకు ఒక్కటవుతున్నారు

ప్రతిపక్ష పార్టీలు మహాకూటమిగా ఏర్పడటాన్ని అవహేళన చేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వాచ్‌మాన్‌ను (తనను) తొలిగించేందుకు వారంతా తమ విభేదాలను పక్కన పెట్టి ఒక్కటవుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు. దక్షిణాదిన ఒకరోజు తమిళనాడు, కేరళ పర్యటనలలో లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరిస్తూ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు సంధించారు.

మదురైలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఆర్థిక నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని, వారు విదేశాలకు పారిపోయినా వదిలిపెట్టడం లేదని చెప్పారు. కేరళలోని త్రిచూర్‌లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలోని కమ్యూనిస్టు పాలకులకు దేశ సంస్కృతిపై గౌరవం లేదని మండిపడ్డారు.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి విద్య, ఉద్యోగాలలో 10శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల దళితులు, గిరిజనులు, ఓబీసీలకు అంతకుముందున్న రిజర్వేషన్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ప్రధాని స్పష్టం చేశారు. తమిళనాడులోని కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం 10శాతం రిజర్వేషన్లపై అనుమానాలు రేకెత్తిస్తున్నారని ధ్వజమెత్తారు. తమిళనాడులోని ప్రతిపక్ష డీఎంకే సహా పలు పార్టీలు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాయని ధ్వజమెత్తారు.

అవినీతికి వ్యతిరేకంగా తాము తీసుకుంటున్న చర్యల వల్ల ఢిల్లీ నుంచి చెన్నై దాకా వణుకు ప్రారంభమైందని ప్రధాని చెప్పారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లు, రక్షణ ఒప్పందాలు, సంక్షేమ పథకాలలో అక్రమ ఒప్పందాలు చేసుకొనేవారు ఇప్పుడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందుకే వారంతా ఏకమవుతున్నారని పేర్కొన్నారు. వారెంత చేసినా అవినీతిపరుల భారతం పట్టకుండా తనను అడ్డుకోలేరని స్పేషీమ్ చేసారు.

మదురై సమీపంలోని తొప్పూర్ వద్ద ఎయిమ్స్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తమను ఎస్సీల జాబితా నుంచి తొలిగించి ఓబీసీలుగా పరిగణించాలన్న దేవేంద్ర కుల వేలలర్ వారి డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

నిజాయితీపరుడైన ఇస్రో శాస్త్రవేత్త ఎస్ నంబి నారాయణన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టి ఇబ్బందులకు గురిచేసిందని ప్రధాని మోదీ కేరళలో ఆరోపించారు. తమిళనాడు పర్యటన అనంతరం కేరళకు వచ్చిన ప్రధాని కొచ్చి, త్రిచూర్‌లలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. నంబినారాయణన్‌ను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించడం తమ ప్రభుత్వానికి దక్కిన గౌరవమని తెలిపారు.

రెండు దశాబ్దాల క్రితం దేశభక్తుడు, కష్టపడి పనిచేసే ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణన్‌పై కక్ష సాధించేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు తప్పుడు కేసు పెట్టారని మండిపడ్డారు. వారు దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి ఓ శాస్త్రవేత్తను ఇబ్బందులకు గురిచేశారు అని ప్రధాని విమర్శించారు.

శబరిమల అంశాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ కేరళలోని వామపక్ష ప్రభుత్వం దేశ సంస్కృతిని, లింగ సమానత్వాన్ని అగౌరపరుస్తున్నదని ఆరోపించారు. కొచ్చిలో భారత్ పెట్రోలియం సంస్థకు చెందిన రిఫైనరీని ప్రధాని జాతికి అంకితం చేశారు. అక్కడే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ శంకుస్థాపన చేశారు.