ఓటు హక్కును వినియోగించుకోవడం పవిత్ర కర్తవ్యం

ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో పవిత్రమైన కర్తవ్యమని, ఆ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకోలేనివారు విచారపడాలని ప్రధాన మంత్రి  నరేంద్రమోదీ పేర్కొన్నారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో భాగంగా ఆదివారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో అపూర్వ సామర్థ్యం కనబరుస్తున్న ఎలక్షన్ కమిషన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. 21వ శతాబ్దలో పుట్టినవారు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ప్రధాని తెలిపారు.

దేశానికి సంబంధించిన బాధ్యతలను తమ భుజాలపై ఎత్తుకొనే అవకాశం వారికి లభించనుంది. జాతి నిర్మాణంలో వారు భాగస్వాములు కానున్నారు. యువత కనే కలలు.. ఈ దేశ స్వప్నాలతో మిళితమయ్యే సమయం ఆసన్నమైంది అని వ్యాఖ్యానించారు. అర్హులైన యువతీయువకులందరూ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటు వేయడం మన పవిత్ర కర్తవ్యం అన్న భావన మనలోనే ఉద్భవించాలి. ఏ కారణం వల్లనైనా ఎవరైనా ఓటు వేయలేకపోతే.. ఆ భావన వారిని బాధ పెట్టేలా ఉండాలి. ఓటు వేయలేకపోయిన వారు దేశంలో జరుగుతున్న తప్పిదాలను చూడాల్సివచ్చినప్పుడు విచారపడాలని పేర్కొన్నారు. 

ఓటు హక్కుకున్న ప్రాధాన్యాన్ని ప్రజలు గ్రహించాలని ప్రధాని కోరారు. ఓటర్లుగా పేర్ల నమోదు, ఓటు హక్కు వినియోగించుకోవడంపై నిర్వహించే అవగాహన కార్యక్రమాలకు సమాజంలోని ప్రముఖులు, పెద్దలు తమవంతుగా సాయమందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశం గణతంత్రంగా మారడానికి ఒకరోజు ముందు, 1950, జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడిందని ప్రధాని గుర్తు చేశారు. భారత్‌లో ఎన్నికలు జరిగే తీరును చూసి ప్రపంచం ఇప్పటికీ అబ్బురపడుతుందని కొనియాడారు.

ఇక ఇటీవల జరిగిన ఖేలో ఇండియా క్రీడల గురించి ప్రధాని ప్రస్తావిస్తూ, స్థానికంగా పరిస్థితులు అనుకూలించాలని లేదా క్రీడలకు బలమైన పునాది ఉన్నప్పుడే యువత తమ సామర్థ్యం మేరకు రాణిస్తారని చెప్పారు. నవ భారత నిర్మాణం బాధ్యత కేవలం మహానగరాలలో నివసించేవారిపై మాత్రమే కాకుండా.. చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే యువత, బాలలు, యువ క్రీడాకారులపై కూడా ఉంటుందని పేర్కొన్నారు.

యువత అంతరిక్ష పరిజ్ఞానం గురించి మాట్లాడుతూ, దేశంలోని ప్రతిభావంతులైన యువ శాస్త్రవేత్తల కారణంగా భారత అంతరిక్ష కార్యక్రమం విజయవంతమవుతున్నదని ప్రధాని తెలిపారు. విద్యార్థులు తయారుచేసిన ఉపగ్రహాలు అంతరిక్షం చేరాయని ఆయన గుర్తు చేశారు. ఈ నెల 30న మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా అమరవీరులందరికీ శ్రద్ధాంజలి ఘటించాలని ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే నెల 19న రవిదాస్ జయంతిని కూడా ప్రధాని ప్రస్తావిస్తూ, మనిషి మతాల వారీగా విడిపోయాడు.. అతనిలోని మానవత్వం కనుమరుగైంది అన్న ఆయన మాటలను గుర్తుచేశారు.