మొండి బకాయిలకు మరో 15 రోజుల గడువు

మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) పరిష్కారార్థం బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇచ్చిన ఆరు నెలల గడువు సోమవారంతో ముగిసినా మరో 15 రోజుల వెసులుబాటు బ్యాంకర్ల ముందుకొచ్చింది. దివాలా తీర్మాన ప్రక్రియలో భాగంగా న్యాయవాదులు, పరిష్కార నిపుణుల (ఆర్పీ) నియామకాల కోసం బ్యాంకులకు ఆర్బీఐ ఈ 15 రోజుల గడువిచ్చినట్లు ఉన్నతాధికారు ఒకరు తెలిపారు. ఈ 15 రోజుల్లో ఏదైనా మొండి బాకీకి సంబంధించి పరిష్కారాన్ని గనుక బ్యాంకర్లు కనుగొనగలిగితే, సదరు ఎన్‌పీఏతో పొత్తున్న మిగతా బ్యాంకర్లూ దాన్ని ఆమోదిస్తే ఆ ఖాతాలు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) కోర్టుకు వెళ్లకుండా ఉండిపోతాయి.

బ్యాంకింగ్ రంగ ఉనికినే ఎన్‌పీఏలు ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో రుణాలు తీసుకున్న సంస్థలు తమ చెల్లింపుల్లో ఒక్కరోజు ఆలస్యమైనా దాన్ని మొండి బకాయిగానే పరిగణించాలని, 180 రోజుల్లోగా ఎన్‌పీఏ తీర్మాన ప్రక్రియను ముగించాలని బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ గడువు ఆగస్టు 27తో ముగిసింది. దీంతో సోమవారం నాటికి సుమారు 70 భారీ ఖాతాల (వీటి విలువ రూ.3.8 లక్షల కోట్లపైనే)ను ఎన్‌పీఏలుగా ప్రకటించి, వాటిని ఎన్‌సీఎల్‌టీకి పంపేలా బ్యాంక ర్లు సిద్ధం కావాల్సి ఉండగా, లీగల్ కౌన్సిల్స్, రిజల్యూషన్ ప్రొఫెషనల్స్ నియామకాలతో 15 రోజుల సమయం బ్యాంకులకు అదనంగా లభించినైట్లెంది.

ఇదిలావుంటే ఎన్‌పీఏల అదుపు విషయంలో వైఫల్యంపై ఆర్బీఐని పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించింది. పెద్ద ఎత్తున పేరుకుపోయిన ఎన్‌పీఏల్లో దాదాపు 34 విద్యుత్ ఆధారిత సంస్థల వాటానే రూ.1.74 లక్షల కోట్లుండగా, ఆర్బీఐ డెడ్‌లైన్‌ను సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన పవర్ కంపెనీలకు చుక్కెదురైంది. ఎన్‌సీఎల్‌టీకి లాగకుండా స్టే విధించాలని విద్యుత్ రంగ డిఫాల్టర్లు కోరగా, ఇందుకు కోర్టు నిరాకరించింది.

కోర్టును ఆశ్రయించిన డిఫాల్టర్ల బకాయిలు దాదాపు రూ.1 లక్ష కోట్లుగా ఉన్నాయి. ఇదిలావుంటే జీఎమ్మార్ చత్తీస్‌గఢ్, ల్యాంకో అన్పర తదితర మరికొన్ని సంస్థలనూ ఎన్‌సీఎల్‌టీకి సిఫార్సు చేయాలని బ్యాంకర్లు చూస్తున్నారు. అత్యంత ప్రమాదకర స్థాయిలో ఎన్‌పీఏలున్న 10 దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉన్నది. వచ్చే ఏడాది మార్చి నాటికి 12.2 శాతానికి మొండి బకాయిలు పెరుగుతాయని అంచనా. భారత్ ఎన్‌పీఏల విలువ రూ.11 లక్షల కోట్లపైమాటే.