బడ్జెట్ లో రైతులకు భారీ ఊరట !


 లోక్‌సభ ఎన్నికల  ముందు ప్రస్తుత ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టె బడ్జెట్ లో రైతులకు భారీ ఊరట కలిగించే పలు అంశాలను ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన  సోమవారం జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో రైతుల శ్రేయస్సుకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రైతుల ఆదాయాల్ని రెట్టింపు చేసే దిశగా భారీ ప్యాకేజీలను కేంద్రం ప్రకటించనున్నట్లు తెలుస్తున్నది. 

చిన్న, సన్నకారు రైతుల సంక్షేమమే ప్రధాన అజెండాగా సమావేశంలో చర్చించనున్నారు. రైతులకు ప్రకటించే ప్యాకేజీలపై ఇప్పటికే వ్యవసాయ మంత్రిత్వశాఖ పలు ప్రతిపాదనలు రూపొందించింది. వీటిపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది అని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 

రైతుల సమస్యల పరిష్కారానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కారాలను వ్యవసాయ శాఖ ఇప్పటికే ప్రతిపాదించింది. మరో నెల రోజుల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి రానుండడం, ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరుగనుండడంతో సోమవారం జరిగే క్యాబినెట్ భేటీ అనంతరం పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. వీటిలో ప్రధానంగా మూడు అంశాలను ప్రకటిస్తారని భావిస్తున్నారు. 

వ్యవసాయ పంట రుణాల్ని నిర్ణీత గడువు లోపల చెల్లించిన రైతుల వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం ఇందులో ఒకటి. తద్వారా ఖజనాపై రూ.15 వేల కోట్ల భారం పడనున్నట్లు అంచనా. ఆహారధాన్యాల పంటలపై ప్రస్తుతం రైతులు చెల్లిస్తున్న బీమా ప్రీమియాన్ని పూర్తిగా మాఫీ చేయడం రెండో ప్రతిపాదన. 

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో అమలు చేస్తున్న రైతుబంధు తరహాలో నేరుగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడం మూడో ప్రతిపాదన. ఒడిశా సర్కారు కూడా ఇదే తరహాలో రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నది. ఈ మూడు ప్రత్యామ్నాయాలపై కేంద్రం గట్టిగా కసరత్తు చేస్తున్నది. 

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో భారీ వ్యవసాయ ప్యాకేజీలు ప్రకటించే అవకాశం ఉందని వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఇటీవలే సంకేతాలిచ్చారు.