జంగిల్ బచావో, జంగిల్ బడావో

తెలంగాణలో ఇప్పటికే ఉన్న అడవిని కాపాడాలని, పోయిన అడవిని పునరుద్ధరించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. జంగిల్ బచావో, జంగిల్ బడావో (ఉన్న అడవిని కాపాడాలి, పోయిన అడవిని పునరుద్ధరించాలి) అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

భూ భాగంలో 33 శాతం పచ్చదనం ఉంటేనే పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. తెలంగాణలో 24 శాతమే అటవీభూమి ఉన్నదని అధికారిక లెక్కల్లో ఉంది. కానీ, రాష్ట్ర భూభాగంలో 12 శాతం కూడా పచ్చదనం లేదు. అటవీ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత విషాదకరంగా ఉందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 

ఓ వైపు చెట్లు పెంచడంకోసం హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు అడవులు అంతరించిపోతుంటే చూస్తూ కూర్చోవడం వల్ల లాభం లేదని, ఉన్న అడవిని కాపాడకుండా.. హరితహారం లాంటి ఎన్ని కార్యక్రమాలు అమలుచేసినా ఫలితం రాదని స్పష్టం చేయారు. రాష్ర్టంలో అడవులు కాపాడే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, కలప స్మగ్లర్లపై పి.డి. యాక్టు నమోదు చేసి శిక్షిస్తామని కెసిఆర్ హెచ్చరించారు. ఇందుకోసం పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి పనిచేయాలని ఆదేశించారు. అటవీ శాఖకు సాయుధ పోలీసులు అండగా నిలుస్తారని, అడవులను నరికేవారిని, స్మగ్లింగ్‌చేసేవారిని గుర్తించే పనిలో ఇంటెలిజెన్స్ ఉందని, వారిని గుర్తించగానే చర్యలు ప్రారంభం కావాలని చెప్పారు.

స్మగ్లింగ్ జీరోసైజుకు రావాలని చెబుతూ అడవుల సంరక్షణ, మొక్కల పెంపకంకోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో పోలీస్, అటవీశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బడ్జెట్‌లో నిర్దిష్టంగా నిధుల్ని కేటాయిస్తామని, ‘కాంపా’ నిధుల్ని కూడా వినియోగించుకుంటామని, అప్పటికీ అవసరమనిపిస్తే ‘గ్రీన్ సెస్’ పేరుతో పన్ను వసూలు చేయాలని అధికారులకు సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. అడవుల సంరక్షణ కోసం ప్రస్తుతమున్న అటవీచట్టాలను పూర్తిస్థాయిలో సమీక్షించాలని సీఎం సూచించారు.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలని, ఖాళీ ప్రదేశాలన్నింటిలోనూ చెట్లను పెంచాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతీ ఇంటిలో చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని, ఇందుకోసమే గ్రామాల్లో చెట్ల పెంపకాన్ని విధిగా చేపట్టడం కోసం పంచాయితీ రాజ్ చట్టంలో మార్పులు తెచ్చామని గుర్తుచేశారు. ప్రతీ గ్రామంలో ఖచ్చితంగా నర్సరీలను ఏర్పాటు చేయాలని, విరివిగా మొక్కలు నాటి, వాటిని రక్షించే బాధ్యతను స్థానిక సంస్థలు స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు.

హైదరాబాద్, వరంగల్ లాంటి మహానగరాలతో పాటు అన్ని నగరాలు, పట్టణాల్లో విరివిగా చెట్లను పెంచాలని, ఆయా నగర ప్రాంతాల్లో ఉన్న అటవీ బ్లాకులను గుర్తించి వాటిని పార్కులుగా మార్చాలన్నారు. ఆ పార్కుల్లో వాకింగ్ ట్రాక్‌లను, వాకర్స్ క్లబ్బులను ఏర్పాటు చేసి ఫారెస్టు బ్లాకుల సంరక్షణ బాధ్యలను వారికే అప్పగించాలని సూచించారు. నగరాలు, పట్టణాల్లో చెట్ల పెంపకానికి ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.