మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయికి భారీ స్మారకం నిర్మించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తునది. రాజ్‌ఘాట్ సమీపంలో వాజ్‌పేయి అంత్యక్రియలు నిర్వహించిన రాష్ట్రీయ స్మృతి స్థల్‌లోనే దీనిని నిర్మించనున్నారు. సెప్టెంబరు 15వ తేదీ తర్వాత ఇక్కడే ‘సమాధి’ నిర్మాణం ప్రారంభం కానుంది. వాజ్‌పేయి 94వ పుట్టిన రోజైన డిసెంబరు 25వ తేదీకి దీనిని పూర్తి చేయాలని బీజేపీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించాలని భావిస్తోంది.
గణతంత్ర దినోత్సవాలకు అతిథిగా ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మోదీ ప్రభుత్వం ఆహ్వానించింది. భారత పర్యటనను ఆయన ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. గణతంత్ర దినోత్సవాలకు అతిథిగా ఎవరు వచ్చినా రాజ్‌ఘాట్ వద్ద నివాళి అర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి రాజ్ఘాట్తోపాటు వాజ్‌పేయి సమాధి వద్ద కూడా ముఖ్య అతిథి నివాళులు అర్పించే అవకాశం ఉందని తెలుస్తున్నది.
వచ్చే ఏడాది ఏప్రిల్-మేల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆలోపు జనవరి 26నే వాజ్‌పేయి స్మారకాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో గాంధీ సమాధి రాజ్‌ఘాట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ స్మారకాలు కాంగ్రెస్ శ్రేణులు గుమిగూడే క్షేత్రాలుగా ఉన్నాయి. కానీ, బీజేపీకి అటువంటి ప్రదేశమేమీ లేదు. ఆ లోటును వాజ్‌పేయి సమాధి భర్తీ చేయనుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.
కాగా, నేతల అధికారిక బంగ్లాలను మ్యూజియాలుగా, స్మారకాలుగా మార్చరాదని గతంలో వాజ్‌పేయి, ఇప్పటి మోదీ ప్రభుత్వాలు నిర్ణయించాయి. దాంతో, చనిపోయే వరకూ వాజ్‌పేయి జీవించిన కృష్ణమీనన్ మార్గ్‌లోని ఇంటిని మ్యూజియంగా మార్చే అవకాశాలు లేవు. వాజ్‌పేయి తన హయాంలో మారిషస్ లో ‘సైబర్ టవర్’ ఏర్పాటుకు సహకరించారు. అందుకు కృతజ్ఞతగా సైబర్ టవర్‌కు వాజ్‌పేయి పేరు పెట్టాలని నిర్ణయించినట్లు 11వ ప్రపంచ హిందీ సదస్సులో మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ ప్రకటించారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని హజ్రత్‌గంజ్ క్రాసింగ్ సహా దేశవ్యాప్తంగా 14 ప్రాంతాలకు మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరు పెట్టనున్నారు. వాజ్‌పేయి హయాంలోనే జార్ఖండ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాంతో, రాష్ట్రంలోని పలు సంస్థలు, ప్రాంతాలకు వాజ్‌పేయి పేరు పెట్టాలని ఆ రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అలాగే, గుజరాత్, హరియాణా, ఛత్తీ్‌సగఢ్, ఢిల్లీలోని పలు ప్రాంతాలకూ వాజ్‌పేయి పేరు పెట్టేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారు.