బెంగాల్ లో 22 సీట్ల గెలుపుకై బీజేపీ పట్టుదల

ఉత్తరాదిన వచ్చే ఎన్నికలలో బిజెపికి తగ్గగలవని భావిస్తున్న లోక్ సభ సీట్లను భర్తీ చేసుకోవడం కోసం పార్టీ నాయకత్వం ప్రయత్నం చేస్తున్న రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్, ఒడిశా ముఖ్యమైనవి కావడం గమనార్హం. ఈ రెండు రాష్ట్రాలలో సగంకు పైగా సీట్లను గెలుచుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. అందుకనే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ బిజెపిపై, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శల తీవ్రతను ఉదృతం చేస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్రల తర్వాత ఎక్కువగా 42 లోక్ సభ సీట్లు బెంగాల్ లో ఉన్నాయి. 2014 ఎన్నికలలో బిజెపి కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుపొందింది. ఇప్పుడు కనీసం 22 సీట్లు గెలుపొందడం కోసం బీజేపీ నేతలు పట్టుదలగా పనిచేస్తున్నారు. ఈ  రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన సిపిఎం ఇప్పుడు నాలుగో స్టషానానికి వెళ్ళిపోయింది. ఒక్క లోక్ సభ సీట్ కూడా గెల్చుకొనే పరిస్థితి లేదు.

ఇక ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా ఉనికి సహితం ప్రశ్నార్ధకరంగా మారుతున్నది. దానితో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన బిజెపి అత్యంత వేగంగా రాష్ట్రంలో తన బలాన్ని పెంచుకొంటున్నది. అందుకనే బీజేపీ ఉనికి అంటేనే మమతకు దిమ్మ తిరుగుతున్నది. మొత్తం 42 నియోజకవర్గాలను చుట్టి వచ్చే విధంగా బిజెపి గత నెలలో మూడు రథ్ యాత్రలకు సిద్ధపడితే శాంతిభద్రతల పేరుతో మమతా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీనిపై న్యాయ పోరాటం చేసిన బిజెపి సుప్రీం కోర్ట్ వరకు వెళ్లి ఎక్కడైనా బహిరంగసభలు ఏర్పాటు చేసుకొనే విధంగా అనుమతి పొందింది.

అందుకనే ఇప్పుడు బిజెపి పెద్ద ఎత్తున రాష్ట్రం అంతటా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నది. మొదటి రెండు సభలను బిజెపి అధ్యక్షుడు అమిత్ షా గత ఈ వారం మాల్డా నుండి ప్రారంభించారు. వచ్చే నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ సహితం ఒక బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. మరో వంక కేంద్ర మంత్రులు పలువురు రాష్ట్రం అంతటా సుడిగాలి పర్యటనలు చేబడుతున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 300కు పైగా బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. ఈ బహిరంగ సభలలో మోదీ, అమిత్ షా లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రసంగించనున్నారు.  

బిజెపి ఉనికి చూస్తేనే వణికి పోతున్నందుననే మమతా బిజెపి రథ్ యాత్రలకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని అమిత్ షా విమర్శించారు. ఈ రథ్ యాత్రలు తన పాలనకు `అంతిమ యాత్ర'లుగా మారగలవాని ఆమె భయపడుతున్నారని ధ్వజమెత్తారు. "మీరు మమ్ములను రథ్ యాత్రలు జరుపకుండా అడ్డుకొంటే మేము బహిరంగ సభలు, ర్యాలీలు జరుపుతాము. మమ్ములను బెంగాల్ కు రాకుండా అడ్డుకోలేరు" అంటూ హెచ్చరించారు. మీరెంతగా తమను అడ్డుకొంటే, తమ పార్టీ కార్యకర్తలను కొడుతూ ఉంటె, బెంగాల్ లో అంతగా కమలం వికాశిస్తుందని మాల్దాలో జరిగిన బహిరంగ సభలో  స్పష్టం చేశారు.