ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా దేశం

 ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించనున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అభిలాషించారు. సంస్కరణలకు పెద్దపీట వేయడంతో పెట్టుబడులపై సానుకూల వాతావరణ పరిస్థితులు నెలకొనడం ఇందుకు దోహదం చేస్తున్నాయని భారత్-దక్షిణాఫ్రికా బిజినెస్ సమ్మిట్‌లో ఆయన వెల్లడించారు. 

ప్రపంచ దేశాల్లో వేగవంతమైన వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశాన్ని నవీన భారత్‌గా తీర్చిదిద్దడానికి కేంద్రం కృత నిశ్చయంతో ఉందన్న ఆయన..ఇందుకోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరుచడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. 2.6 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్ ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతున్నది. అగ్రస్థానంలో అమెరికా ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్‌లు కొనసాగుతున్నాయి. 

దేశీయ తయారీ రంగాన్ని మరింత బూస్ట్‌నివ్వడానికి మేక్ ఇన్ ఇండియా, డిజిటలైజేషన్‌కు పెద్దపీట వేసినట్లు తెలిపారు. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మా ముందున్న లక్ష్యం..విదేశీ పెట్టుబడులు ఆకట్టుకుంటున్న దేశాల్లో తొలిస్థానంలో భారత్ ఉన్నప్పటికీ సంతృప్తిగా లేము..దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకల ఉన్న రంగాల్లో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

ప్రస్తుత సంవత్సరానికిగాను సులభతర వాణిజ్య విధానంలో భారత్‌కు 77వ స్థానం దక్కింది. గడిచిన నాలుగేండ్లలోనే 65 స్థానాలు మెరుగుపడిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. నవీన భారత్ నిర్మాణ క్రమంలో భాగంగా మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, వేగవంతం, పరిధిని మరింత విస్తరించనున్నట్లు ఆయన ప్రకటించారు. 

భారత్-దక్షిణాఫ్రికా దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై ఆయన మాట్లాడుతూ..గడిచిన కొన్ని సంవత్సరాలుగా తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనైప్పటికీ 2017-18లో 10 బిలియన్ డాలర్లు దాటిందని తెలిపారు. ఇరు దేశాల్లో బోలేడన్ని అవకాశాలున్నాయని, ముఖ్యంగా స్నేహపూర్వక వాతావరణంతో పెట్టుబడిదారులు కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో 10 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడితోపాటు 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 

భారత్‌లో ఆహార, ఆగ్రో ప్రాసెసింగ్, గనులు, రక్షణ, బీమా, మౌలిక సదుపాయాల రంగంలో ఉన్న అవకాశాలను దక్షిణాఫ్రికా పెట్టుబడిదారులు అందిపుచ్చుకోవాలని సూచించారు. అలాగే స్టార్టప్, హెల్త్‌కేర్, ఫార్మా, బయోటెక్, ఐటీ, ఐటీ అనుబంధ రంగాలకు చెందిన వాటితో కలిసి పనిచేయాలని దేశీయ సంస్థలకు ప్రధాని కోరారు. మరోవైపు జెమ్స్ అండ్ జ్యువెల్లరీ రంగాల్లో ఇరు దేశాలు భారీగా ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న వీసా పరిమితులను మరింత సరళతరం చేయాలని సూచించిన ప్రధాని..తద్వారా ముఖ్యంగా వ్యాపారవేత్తలు, టూరిస్తులు నేరుగా సందర్శించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 

భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు  సైరిల్ రామాఫోస మాట్లాడుతూ..వ్యవసాయం, ఐసీటీ, ఏరోస్పెస్, ఇంధన రంగాల్లో ఇరు దేశాలు సహాయ సహకారాలు పెంచుకోవడానికి వీలున్నది. భారత్‌కు చెందిన టాటా, సిప్లా, మహీంద్రాలలు కలుపుకొని 150 కంపెనీలు దక్షిణాఫ్రికాలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయని చెప్పారు.