లైంగిక దోపిడిపై క్షమాపణ కోరిన పొప్

కేథలిక్‌ మత బోధకులు చిన్నారులపై లైంగిక దోపిడీకి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై వాటికన్‌ అధిపతి పోప్‌ ఫ్రాన్సిస్‌ స్పందించారు. ఈ దైవద్రోహాన్ని జరిగిన ఈ 'ద్రోహాన్ని' క్షమించాలని ఆయన ప్రపంచ దేశాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత ఐర్లండ్‌ను సందర్శించిన తొలి మతాచార్యుడైన పోప్‌ ఫ్రాన్సిస్‌ లైంగిక దాడుల బాధితులను కలిసి పరామర్శించారు. మతబోధకులు వారితో వ్యవహరించిన తీరు, మత, వ్యవస్థాపరమైన దుర్వినియోగంపై వారి నుండి సమాచారాన్ని సేకరించారు. ఈ 'దురాచారాన్ని' సమూలంగా నిర్మూలించేందుకు తాను చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పారు.

అయితే చర్చ్‌లో కొనసాగుతున్న ఈ లైంగిక దాడుల విషయంలో పోప్‌పై అంతర్జాతీయంగా వత్తిడి పెరుగుతుండటమే కాక ఆయన్ను మత పెద్ద పదవి నుండి తప్పుకోవాలన్న డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ లైంగిక దోపిడీకి గురైన యువత కథలు విన్న తమలో ఏ ఒక్కరూ స్పందించలేదని, వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని దోపిడీ చేసి వారిని భయభ్రాంతులకు గురి చేశారని పోప్‌ ఫ్రాన్సిస్‌ నాక్‌ ప్రార్థనా మందిరంలో జరిగిన సమావేశంలో వివరించారు.

బాధితులకు న్యాయం అందించటంలోనూ, సత్యాన్ని వెలికి తీయటంలోనూ కఠినంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ఈ దారుణ గాయం తమను బాధిస్తోందన్నారు. ఈ పాపాలను, దేవుని కుటుంబంలో అనేక మంది భావిస్తున్న ఈ విద్రోహాన్ని క్షమించాలని తాను కోరుతున్నానని ఆయన చెప్పారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ లైంగిక దోపిడీ నాలుగుదశాబ్దాల క్రితం వరకూ ఐరిష్‌ సమాజాన్ని ఏలిన క్రైస్తవం విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. క్రైస్తవం ఆకాంక్షలకు వ్యతిరేకంగా గత మూడేళ్ల కాలంలో ఐరిష్‌ ఓటర్లు అబార్షన్‌ను, స్వలింగ సంపర్కుల వివాహాలను రిఫరెండంలలో ఆమోదించారని ఆయన గుర్తు చేశారు.

వాటికన్‌ చర్చ్‌లో కొనసాగుతున్న లైంగిక దోపిడీ గురించి పోప్‌ ఫ్రాన్సిస్‌కు 2013 నుండే తెలుసునని అమెరికాలో వాటికన్‌ మాజీ రాయబారి ఆర్చిబిషప్‌ కార్లో మరియా విగానో స్పష్టం చేశారు. లైంగిక దోపిడీ గురించి తెలిసినప్పటికీ మౌనం పాటించి ఇప్పుడు ఈ విషయం వెలుగు చూడగానే క్షమించాలంటున్నారని ఆయన విమర్శించారు. ఈ దైవద్రోహానికి బాధ్యత వహిస్తూ పోప్‌ ఫ్రాన్సిస్‌ వాటికన్‌ ఆధిపత్యం నుండి తప్పుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రపంచ క్రైస్తవంలో కొనసాగుతున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో పోప్‌ తన తప్పిదాలను ఒప్పుకోవాలని, తప్పులను సహించబోమన్న మార్గదర్శక సూత్రాల ప్రకారం ఆయన పదవి నుండి తప్పుకుని ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలని విగానో పోప్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. క్రైస్తవం ఈ దారుణ పరిస్థితులను దీటుగా ఎదుర్కొని భవిష్యత్తులో ఇటువంటి దుర్వినియోగానికి తెరదించాలన్న ఉద్దేశంతోనే తానీ లేఖ రాశానని ఆయన వివరించారు.