రాహుల్ చైనా మంత్రులను ఎందుకు కలిశారు !

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు.  గత ఏడాది ఆయన కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళినపుడు ఇద్దరు చైనా మంత్రులను కలిసినట్లు చెప్పడం ఈ వివాదానికి కారణమైనది. దీనిపై భారతీయ జనతా పార్టీ ఆయనను నిలదీసింది. ప్రభుత్వానికి తెలియకుండా చైనా మంత్రులను ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేసింది.

భువనేశ్వర్‌లో శుక్రవారం జరిగిన ఒడిశా చర్చా కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ తాను కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళినపుడు, తాను ఇద్దరు చైనా మంత్రులను కలిశానని తెలిపారు. ఉద్యోగాల సృష్టి గురించి వారితో చర్చించానన్నారు.

‘‘మనం చైనాతో పోటీ పడాలి. ఉద్యోగాలను సృష్టించడంలో చైనా సామర్థ్యం ఏకైక అతి పెద్ద సవాలు అని మనం అంగీకరించాలి. నేను కైలాస మానస సరోవర్‌కు వెళ్ళినపుడు ఇద్దరు చైనా మంత్రులను కలిశాను, ఉద్యోగాల సృష్టి గురించి వారితో చర్చించాను’’ అని రాహుల్ గాంధీ చెప్పారు.

రాహుల్ గాంధీ 2018 సెప్టెంబరులో కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళిన సంగతి తెలిసిందే. రాహుల్ తాజా వ్యాఖ్యలపై భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు స్పందిస్తూ రాహుల్ గాంధీ తన వ్యక్తిగత హోదాలో వెళ్ళారని, ఆయన చైనా మంత్రులను కలిసి ఉంటే, ఆ భేటీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినది కాదని స్పష్టం చేశారు. 

బీజేపీ అధికార ప్రతినిథి సంబిత్ పాత్రా స్పందిస్తూ కైలాస మానస సరోవర యాత్ర సందర్భంగా తాను చైనా మంత్రులను, అధికారులను కలవబోనని రాహుల్ గాంధీ గతంలో చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం తాను యాత్రకు వెళ్ళినపుడు, చాలామంది చైనా మంత్రులను కలిసినట్లు చెప్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అంగీకరించకపోయినా, రాహుల్ గాంధీ అంగీకరిస్తున్నారని పేర్కొన్నారు. 

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో రాహుల్ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత దేశ దౌత్య కార్యాలయానికి ఈ వివరాలను ఎందుకు తెలియజేయలేదని నిలదీశారు. చైనా మంత్రులతో ఏం మాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. సత్యం ఎప్పటికైనా బయటపడుతుందని తాము గతంలోనే చెప్పామన్నారు.