పరుగులు దీస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

వడ్డీ రేట్లను క్రమేపీ పెంచనున్నట్టు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చేసిన వ్యాఖ్యానంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో బుల్లిష్ సెంటిమెంట్ దేశీయ స్టాక్ మార్కెట్లను పరుగులు పెట్టించింది. దాదాపు ఐదు నెలల తర్వాత ఒక్క రోజులో భారీ పెరుగుదలను నమోదు చేసింది. సరికొత్త శిఖరాలను చేరుకుంది. నిఫ్టీ ఒకదశంలో 11,700.95 స్థాయిని కూడా తాకింది.

మార్కెట్ ప్రారంభం నుంచి విరామం లేకుండా పెరుగుతునే చివరికి గరిష్టస్థాయికి సమీపంలో ముగిసింది. సెన్సెక్స్ 442.31 పాయింట్ల లాభంతో 38,694.11 వద్ద ముగిస్తే నిఫ్టీ 134.85 పాయింట్ల లాభంతో 11,691.95 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్‌ఐఐలు, డీఐఐలు భారీగా కొనుగోళ్లు జరపడంతో మార్కెట్లు ర్యాలీ వేగం పుంజుకుంది. ఆర్థికవ్యవస్థ ప్రయోజనాలు కాపాడేందుకు వడ్డీ రేట్లను క్రమేపీ పెంచుతామన్న ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పోవెల్ వాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లన్నీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. దీనికి తోడు యాన్ కరెన్సీ మారకం రేటును ప్రతి రోజు నిర్ణయించేందుకు చైనా విధాన ప్రకటన చేయడంతో కూడా అంతర్జాతీయ మార్కెట్ల సెంటిమెంట్ బుల్లిష్‌గా మారింది.

ఈ వారం ప్రారంభంలో అన్ని రంగాల షేర్లు పాల్గొన్నాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ గరిష్టంగా 2.16 శాతం లాభపడింది. ఐటీ ఇండెక్స్ 1.67 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.54 శాతం , మెటల్ ఇండెక్స్ 1.48 శాతం, ఆటో ఇండెక్స్ 0.83 శాతం చొప్పున లాభపడ్డాయి. మిడ్‌క్యాప్-100 ఇండెక్స్ 1.19 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.76 శాతం లాభంతో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో మొత్తం 986 షేర్లు లాభాల్లో ముగిస్తే 825 షేర్లు నష్టాల్లో ముగిసాయి. కాగా, హిండాల్కో 3.65 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 3.51 శాతం, పవర్ గ్రిడ్3.35 శాతం, టెక్‌మహీంద్రా 3.21 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీలో కేవలం మూడు షేర్లే నష్టాల్లో ముగిసాయి. అందులో సన్ ఫార్మా 1.32 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 0.29 శాతం, డాక్టర్‌రెడ్డీస్ 0.10 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్‌ఐఐలు రూ. రూ. 252.52 కోట్ల కొనుగోళ్లు జరపగా, డీఐఐలు రూ. 1117.24 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. రిలయన్స్, టీసీఎస్ షేర్లు కొత్త గరిష్ఠ స్థాయిలను నమోదు చేశాయి. బీఎస్‌ఈలో మొత్త 136 షేర్లు 52 వారాల గరిష్టస్థాయిని నమోదు చేయగా 120 షేర్లు కనీస స్థాయిని నమోదు చేశాయి.

క్రితం గరిష్ఠ స్థాయి 11,620 స్థాయిని అధిగమించడం ద్వారా నిఫ్టీలో తాజా బుల్లిష్ బ్రేకవుట్ జరిగింది. ఒక రోజు అనిశ్చితి తర్వాత బుల్స్ భారీ కొనుగోళ్లతో మార్కెట్‌ను పరుగులు పెట్టించారు. ఆగస్టు సీరిస్ ముగింపు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రభావం కనిపించలేదు.భారీ బుల్లిష్ క్యాండిల్ ఏర్పాటుతో మరికొన్ని రోజులు కూడా పాజిటివ్ ధోరణే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొనుగోళ్ల మద్దతు కొనసాగితే తదుపరి 11, 760 -11,800 వరకూ పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి 11,600 స్థాయినే మద్దతు స్థాయిగా పరిగణించాలి.

అప్‌వార్డ్ చానెల్ లోనే నిఫ్టీ కదులుతున్నందున్న ఎలాంటి బేరిష్ అంచనాలను ఇప్పటికి వేయలేం. ఒకవేళ ఈ వారం అంతా ర్యాలీ కొనసాగితే 12,000స్థాయినికూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ గత 9 ట్రేడింగ్ సెషన్లుగా కొత్త గరిష్ఠ స్థాయిలను చేరుకోవడంలో విఫలం అవుతున్నది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇందులో ఒడిదుడుకులు పెరగవచ్చు. కాగా ఒడిదుడుకుల ఇండెక్స్ 12.31 స్థాయికి పతనం అయింది.