మాజీ ఉగ్రవాదికి అశోక్ చక్ర పురస్కారం

విద్వేష భావజాలానికి ప్రేరేపితుడై ఉగ్రవాదిగా మారిన ఆ వ్యక్తి ఆ తర్వాత కొంతకాలానికి తన తప్పు తెలుసుకున్నాడు. ఉగ్రవాదాన్ని వీడి సైన్యంలో చేరి ఎంతగానో సేవ చేశాడు. చివరకు కర్తవ్య నిర్వహణలో ముష్కరులతో పోరాడుతూ 38 ఏళ్ళ వయస్సులో గత సంవత్సరం అమరుడయ్యాడు. ఆయనే లాన్స్‌ నాయక్‌ నజీర్‌ అహ్మద్‌ వనీ.

ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సైన్యంలోని అత్యున్నత పురస్కారమైన అశోక చక్రతో సత్కరించనుంది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ఈ పురస్కారాన్ని వనీ కుటుంబసభ్యులు అందుకోనున్నారు.

దక్షిణ కశ్మీర్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన కుల్గాం జిల్లాకు చెందిన నజీర్‌ అహ్మద్‌ వనీ గతంలో ఓ ఉగ్రవాది. 1990లలో ఉగ్రకార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న వనీ ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని పూర్తిగా మారిపోయాడు. పోలీసుల ముందు లొంగిపోయిన వనీ.. 2004లో టెరిటోరియల్‌ ఆర్మీ బెటాలియన్‌లో చేరారు.

కాశ్మీర్ లోయలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న రాష్ట్రీయ రైఫిల్ కు అనుబంధంగా ఈ బెటాలియన్ లో ఉంటూ   అప్పటి నుంచి సైన్యానికి ఎంతగానో సేవ చేశారు. 2007, 2018లో సేనా పతకాన్ని అందుకున్నారు.

గతేడాది నవంబరులో షోపియాన్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులతో పోరాడాడు. ఆ ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన వనీని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఆపరేషన్ లో ఆరుగురు ఉగ్రవాదులను హతం సహసారు. ముష్కరులను మట్టుబెట్టేందుకు తన ప్రాణాలు అర్పించిన అహ్మద్‌ వనీ ధైర్యసాహసాలకు మరణానంతరం అశోక్‌ చక్ర లభించింది.  వనీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని పిల్లలకు ఇప్పుడు 18, 20 ఏళ్ళ వయస్సు.