కొందరికి కుటుంబమే పార్టీ.... బీజేపీకి పార్టీయే కుటుంబం

ప్రియాంక గాంధీ వాద్రాకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడాన్ని బీజేపీ విమర్శించింది. ఆ పార్టీలో కుటుంబ పాలనకు ఇది నిదర్శనమంటూ ఎద్దేవా చేసింది. కొందరికి కుటుంబమే పార్టీ అని, అయితే బీజేపీకి మాత్రం పార్టీయే కుటుంబమని అంటూ  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలోని బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ “మన పార్టీలో నిర్ణయాలు ఒక కుటుంబం లేదా వ్యక్తి ఆలోచనల ప్రాతిపదికపై ఉండవు. చాలా సందర్భాల్లో కుటుంబమే పార్టీగా ఉంటోందని అంటూ ఉంటారు. కానీ బీజేపీకి మాత్రం పార్టీయే కుటుంబం” అని చెప్పారు.

“మన పార్టీలో నిర్ణయాలు తీసుకునేటపుడు ఎవరు ఏ కుటుంబానికి చెందినవారనే విషయాన్ని చూడబోం. ఫలానా కుటుంబం ఏం కోరుకుంటోందనే ప్రాతిపదికపై మన పార్టీలో నిర్ణయాలు జరగవు”  అని స్పష్టం చేశారు.

బిజెపిని ప్రజాస్వామ్య విలువలు నడిపిస్తుంటే..మిగిలిన పార్టీలను కుటుంబాలు నడిపిస్తున్నాయని ప్రియాంక గాంధీ రాజకీయ రంగ ప్రవేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ‘పరివార్‌వాది’ పార్టీ అని అభివర్ణించారు. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అన్న తన మాటలకు అర్థం కాంగ్రెస్‌ సంస్కృతిని తొలగించడమేనని తెలిపారు. ఆ పార్టీ చెడుతో నిండిపోయిందని అన్నారు. ప్రజాస్వామ్యమే భాజపాను నడిపిస్తోందని, అందుకే దేశ ప్రజలు తమ పార్టీతో సన్నిహితంగా ఉంటారని చెప్పారు.

ప్రధాని మోదీ పేదల కోసం ఆలోచిస్తూ ఇటీవల వారికి 10 శాతం కోటాను కల్పిస్తే.. కాంగ్రెస్‌లో మాత్రం ఒకే ఒక్క కుటుంబానికి రిజర్వేషన్‌ ఉంటుందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.