టిడిపితో పొత్తు లేదని తేల్చి చెప్పిన కాంగ్రెస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపితో పొత్తు ఏర్పరచుకొని చతికిల పడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అటువంటి ప్రయత్నం చేయబోవడం లేదని తేల్చి చెప్పింది. పొత్తు విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మరుసటి రోజునే కాంగ్రెస్ ఈ విషయంలో తెగేసి  చెప్పడం గమనార్హం.

కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ విజయవాడలో సమావేశమై పొత్తులపై సుదీర్ఘ చర్చలు జరిపింది. టిడిపితో పొత్తు అరిష్టం కాగలదని నిర్ణయానికి వచ్చింది. జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్, టిడిపి సంబంధాలు ఎట్లా ఉన్నా రాష్ట్రంలో మాత్రం ఎవ్వరికీ వారే అంటూ స్ఫష్టం చేసింది.

ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తామని ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జి ఊమెన్ చాందీ స్పష్టం చేశారు. 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. పైగా, ఈ విషయమై తమకు దీనిపై పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని కూడా చెప్పారు.

తెలంగాణ ఎన్నికలలో ఘోర పరాజయంపై లోతుగా పరిశీలన చేయించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడం వల్లన తాము ప్రతికూలత ఎదుర్కోవలసి వచ్చిన్నట్లు గ్రహించినట్లు తెలుస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ లో సహితం ఆ పార్టీతో కలిస్తే ప్రభుత్వం వ్యతిరేక ప్రభావంతో తాము కూడా కొట్టుకు పోతామని భావిస్తున్నారు.

2014 ఎన్నికలలో ఏపీలో తుడిచి పెట్టుకు పోయి, ఒక్క సీట్ కూడా గెలుపొందలేకే అపోయినా ఇప్పుడు పరిస్థితి కొంతమెరుగు అవుతున్నట్లు గ్రహిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలో గెలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తూ మొదటి సంతకం చేస్తామని రాహుల్ చేసిన ప్రకటనను ప్రధాన ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకొనే ప్రయత్నం చేయాలి అనుకొంటున్నారు.