ఎర్రకోటలో క్రాంతి మందిర్ మ్యూజియం

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో క్రాంతి మందిర్ పేరిట ఏర్పాటు చేసిన మూడు మ్యూజియంల సముదాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ  ప్రారంభించారు. ఒక మ్యూజియం సుభాష్ చంద్రబోస్‌పై కాగా, రెండోది జలియన్‌వాలాబాగ్- మొదటి ప్రపంచయుద్ధానికి సంబంధించినది, మూడోది భారతీయ చిత్రకళపై ఏర్పాటు చేశారు. 

నేతాజీపై ఏర్పాటు చేసిన మ్యూజియంలో బోస్, భారత జాతీయ సైన్యం (ఐఎన్‌ఏ)కు సంబంధించిన పలు వస్తువులను ఉంచారు. వాటిలో నేతాజీ వాడిన ఒక కుర్చీ, కత్తి ఐఎన్‌ఏ సైనికుల దుస్తులు, బ్యాడ్జీలు, పతకాలు ఉన్నాయి. బోస్‌పై రూపొందించిన ఒక డాక్యుమెంటరీ చిత్రాన్నీ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీకి బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యానం చేశారు.

 ఇక జలియన్‌వాలా బాగ్‌పై యాద్-ఏ-జలియన్ పేరిట ఏర్పాటుచేసిన మ్యూజియంలో 1919, ఏప్రిల్ 13న బ్రిటిష్ సైనికులు భారతీయులపై సాగించిన ఊచకోత ఘటనలను చిత్రాల రూపంలో ప్రదర్శించారు.

మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికుల వీరోచిత పోరు, వారి సాహసం, శౌర్యాల చిత్రాలను ఉంచారు. బ్రిటిష్ వారి తరఫున పోరాడిన భారత సైనికులపై సరోజినీ నాయుడు రాసిన కవిత కూడా ఈ మ్యూజియంలో ఉంది. 

భారతీయ చిత్రకళలపై దశ్యకళ పేరిట ఏర్పాటు చేసిన మరో మ్యూజియంలో అమృతా షేర్గిల్, రాజా రవివర్మ గీసిన పలు అద్భుత కళాఖండాలను ప్రదర్శనకు ఉంచారు. దాదాపు గంటపాటు ప్రధాని మోదీ ఈ ప్రదర్శనశాలలను సందర్శిస్తూ గడిపారు.