టీడీపీ- జనసేన పొత్తు అంటూ కలకలం రేపిన టిజి

ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన పొత్తు ఏర్పర్చుకోబోతున్నట్లు సంకేతం ఇవ్వడం ద్వారా టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ కలకలం రేపారు. ఈ వాఖ్యలపట్ల అటు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యారు. ఈ విషయమై ఇద్దరు టిజికి హెచ్చరికలు జారీ చేశారు.

పాము-ముంగీసలా ఉండే ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ- జనసేన పొత్తు తప్పుకాదని వెంకటేష్ ప్రకటించారు. ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటని టీజీ వెంకటేష్‌ ప్రశ్నించిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. మార్చి నెలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగే అవకాశం ఉందని వెంకటేష్‌ చెప్పారు.  

టీజీ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పాలసీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు సరికాదని, ఈ తరహా ప్రకటనలతో అయోమయానికి గురిచేయొద్దని, పార్టీ విధానాలపై కామెంట్లు చేసేటప్పుడు నేతలు సంయమనం కోల్పోవద్దని చంద్రబాబు సూచించారు. ఎన్నికల తరుణంలో ఇలాంటి కామెంట్లతో గందరగోళం సృష్టిస్తే ఎవరికీ మంచిది కాదని చంద్రబాబు హెచ్చరించారు. 

మరోవంక,  పవన్ కల్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. టీజీ వెంకటేష్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదంటూ హెచ్చరించారు. తాను వద్దనుకుంటే వచ్చిన రాజ్యసభ సీటు తెచ్చుకున్న టీజీకి బుద్ధి చెబుతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్టణం జిల్లా పాడేరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘పెద్దమనిషి అని గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నా. నేను నోరు అదుపు తప్పితే మీరు ఏమవుతారో తెలియదు.’’ అంటూ గర్జించారు. పారిశ్రామికవేత్తగా నదులు, పర్యావరణాన్ని టీజీ వెంకటేష్ కలుషితం చేస్తున్నారని పవన్ ఆరోపించారు.

తొలుత, టీడీపీ, జనసేన మధ్య పెద్దగా విభేదాలు లేవని వెంకటేష్‌ స్పష్టం చేశారు.  కేంద్రంపై పోరాటం విషయంలోనే విభేదాల తప్ప ఇంకేమీ లేవని చెప్పారు. కుర్చీపై ఆశ లేదని గతంలో పవన్‌ కల్యాణ్ చాలాసార్లు చెప్పారని అంటూ ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు...టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు.