ప్రియాంక ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం..యుపిలో బాధ్యతలు

ఇప్పటి వరకు తన తల్లి, సోదరుడి సొంత నియోజకవర్గాలైన రాయ్‌బరేలి, అమేథిలకు పరిమితం అవుతున్న ప్రియాంక గాంధీ 2019 ఎన్నికలలో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించి, కాంగ్రెస్ లో కీలక భూమిక వహించడానికి రంగం సిద్ధమైంది. ఉత్తర ప్రదేశ్ లో కీలకమైన తూర్పు ప్రాంత విభాగం బాధ్యతలను ఆమెకు అప్పగించారు. ఆమెతో పాటు   పశ్చిమ ప్రాంతం బాధ్యతలను మరో యువనేత జ్యోతిరాధిత్య సింథియాకు అప్పగించారు.

కాంగ్రెస్ ను పక్కకు నెట్టి ఎస్పీ, బీఎస్పీలు పొత్తు కుదుర్చుకొని యుపిలో పోటీకి సిద్ధపడిన సమయంలో రాహుల్ గాంధీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరు యువనేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులుగా నియమించి ప్రియాంకకు యుపిలో తూర్పు ప్రాంతం, సింధియాకు పశ్చిమ ప్రాంతం అప్పచెప్పారు.వీరిద్దరితో ఉత్తర ప్రదేశ్ లో తన ప్రభావం చూపాలని రాహుల్  ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటి వరకు తెర వెనుక అన్నకు చేదోడుగా ఉంటూ వస్తున్న ప్రియాంక ఇక తెర ముందుకు వచ్చి కీలక పాత్ర పోషింపనున్నారు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల అభ్యర్థులను నిర్ణయించడంలో తల్లి సోనియా గాంధీతో కలసి ఆమె నిర్ణయాత్మక పాత్ర వాయించడం తెలిసిందే. యుపి తూర్పు ప్రాంతంలో బిజెపి ప్రచార బాధ్యతలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్వహిస్తున్నారు.  రాయ్‌బరేలి, అమేథి నియోగాజకవర్గాలు సహితం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.

కాంగ్రెస్ సైద్ధాంతిక పోరాటం చేస్తోందని, ప్రియాంక, జ్యోతిరాదిత్య సింథియా వంటి యువ నేతలతో తాము ఈ పోరాటంలో ముందడుగు వేస్తామని చెబుతూ ఒక విధంగా అఖిలేష్ యాదవ్, మాయావతి లకు రాహుల్ సవాల్ విసిరారు. పేదలు, బలహీన వర్గాల కోసం తాము తాము ఫ్రంట్ ఫుట్‌పై పోరాడతామని, ఉత్తర ప్రదేశ్‌కు, ఉత్తర ప్రదేశ్ యువతకు అవసరమైనవాటి కోసం పోరాడుతామని ప్రకటించారు. బ్యాక్‌ఫుట్‌ మీద ఆడే పార్టీ తమది కాదని, ఎక్కడైనాసరే ఫ్రంట్ ఫుట్‌పైనే ఆడతామని ఒక విధంగా అఖిలేష్, మాయావతి లను ఎద్దేవా చేశారు.

ఇలా ఉండగా, ప్రియాంక గాంధీ వాద్రాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడం అంటే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఓడిపోయారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించడమేనని బిజెపి విమర్శలు గుప్పించింది. ఇది ఊహించిందే అని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా పేర్కొన్నారు.

‘నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి ఇప్పుడు మరో వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. వారికి పార్టీ అంటే వారి కుటుంబం మాత్రమే. కానీ బిజెపి పార్టీనే ఒక కుటుంబంలా భావిస్తుంది. రాహుల్‌ గాంధీ వైఫల్యాన్ని కాంగ్రెస్‌ అంగీకరించింది. అందుకే ప్రియాంకను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది’ అని పాత్రా ఎద్దేవా చేశారు.