ఏటా 5 రోజులు అడవిలో ఉండేవాడిని: మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తాను యువకుడిగా ఉన్నప్పుడు చేసిన పనుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే అనే ఫేస్‌బుక్‌ పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను గుర్తు తెచ్చుకున్నారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఏటా దీపావళి సమయంలో ఐదు రోజుల పాటు అడవిలోకి వెళ్లిపోయేవాడినని, ఎవ్వరూ లేని చోటుకు వెళ్లి ప్రశాంతంగా గడిపేవాడినని చెప్పారు.

 దీనికోసం స్వచ్ఛమైన నీరు ఉన్న చోటును ఎంచుకునేవాడినని, సరిపడా ఆహారం తీసుకెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. రేడియో, దినపత్రికలు ఏమీ లేకుండా గడిపేవాడిన్నారు.  అది తనను తాను మెరుగుపరుచుకోవడానికి ఎంతో ఉపయోగపడిందన్నారు. అప్పట్లో టీవీ, ఇంటర్నెట్‌ లేవని చెప్పారు. బిజీ జీవితాలకు దూరంగా అలా గడపడం చాలా హాయిగా అనిపించేదని చెప్పారు. 

రోజువారీ హడావుడి జీవితాలకు విరామం ఇచ్చి.. కొంత సమయం మీతో మీరు గడిపితే అది ఎంతో ఉపయోగపడుతుందని మోదీ యువతకు సలహా ఇచ్చారు. అప్పుడే నిజమైన ప్రపంచంలో జీవించడం మొదలుపెడతారని సూచించారు. అప్పడు మీపై మీకు నమ్మకం పెరుగుతుందని, ఇతరులు మీ గురించి ఏం చెప్తున్నారో అర్థం చేసుకోగలుగుతారని సూచించారు.

 మీకు మీరే ప్రత్యేకమని, ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూడొద్దని పేర్కొన్నారు. మోదీ ఈ ఇంటర్వ్యూలో తన బాల్యం గురించి మాట్లాడుతూ పదిహేడేళ్ల వయసులో రెండు సంవత్సరాల పాటు హిమాలయాలకు వెళ్లినట్లు తెలిపారు.

‘హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత ఇతరులకు సేవ చేసేందుకు నా జీవితాన్ని ఉపయోగించాలనుకున్నాను. ఆ తర్వాత అహ్మదాబాద్‌ వెళ్లాను. పెద్ద నగరంలో జీవించడం అప్పుడే తొలిసారి. అక్కడ అప్పుడప్పుడూ మా అంకుల్‌కు క్యాంటీన్‌లో సాయం చేసేవాడిని. అదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా మారాను' అని పేర్కొన్నారు. 

అప్పుడే ప్రజల జీవితాల గురించి తెలుసుకోవడం ఆరంభించాను. ఇతరులతో కలిసి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం శుభ్రం చేసేవాడిని, టీ, ఆహారం తయారు చేయడం, పాత్రలు శుభ్రం చేయడం లాంటి అన్ని పనులు చేసేవాడిని. 

అయితే రోజువారి కార్యక్రమాలలో పడిపోయి జీవితంలో సంపాదించుకున్న ప్రశాంతతను కోల్పోకూడదని భావించేవాడిని. అందుకే కొన్ని రోజుల పాటు అడవిలోకి వెళ్లి ఒంటరిగా గడిపేవాడనని తెలిపారు మోదీ. 

అయితే కొద్ది రోజుల తర్వాత తాను అడవికి వెళ్తున్నానే విషయం మిగతా వారికి తెలిసి పోయిందన్నారు. దాంతో వారు నన్ను  ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అని అడిగేవారు. అందుకు నేను ‘నన్ను నేను తెలుసుకునేందుకు వెళ్తున్నాను’ అని చెప్పేవాడినని తెలిపారు మోదీ. యువతకు కూడా ఇదే సలహా ఇచ్చారు మోదీ.