గ్రీన్‌ఫీల్డ్‌ రాజధానిగా అమరావతి

బోంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ) అమరావతి బాండ్లు నమోదు కావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతోషం ప్రకటించారు. అమరావతి బాండ్లు సోమవారం  బీఎస్‌ఈ సెన్సెక్స్ లో నమోదయ్యాయి. సీఎం చంద్రబాబు గంట కొట్టి వాటి లిస్టింగ్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గ్రీన్‌ఫీల్డ్‌ రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నామని చెబుతూ రాజధాని కలను నిజం చేసుకునేందుకు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ’రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు అద్భుతమైన నగరం లేదు. భూమి లేదు. రాజధాని కోసం రైతులను ఒప్పించి 35వేల ఎకరాలు సమీకరించాం. సింగపూర్‌ నుంచి బృహత్తర ప్రణాళిక రూపకల్పన చేయించి నిర్మాణంలో పెట్టాం. మాపై విశ్వసనీయతతో సింగపూర్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా బృహత్తర ప్రణాళిక రూపొందించి ఇచ్చింది’ అని తెలిపారు.

ప్రపంచంలో ఐదో అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలన్నది తమ సంకల్పం అని తెలుపుతూ 2029 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్‌ సంపద కలిగిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని చెప్పారు. మౌలిక సదుపాయాలు, వనరులు తమ సొంతం అని అంటూ  బీఎస్‌ఈ మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌ కూడా ప్రగతి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. ఐటీ రంగంలో ఎక్కువమంది నిపుణులు భారత్‌ నుంచి ముగ్గురు ఉంటే, వారిలో ఏపీ నుంచి ఒకరు కచ్చితంగా ఉంటారని చెప్పారు. రాష్ట్రానికి ‘సన్‌రైజ్‌ ఏపీ’గా నామకరణం చేశామని చెబుతూ సౌరశక్తిని వినియోగించుకుని ప్రగతి దిశగా వెళ్లాలన్నది తమ లక్ష్యం అని తెలిపారు.

217 చదరపు కిలోమీటర్ల పరిధిలో నగర నిర్మాణం జరుగుతోందిని చెబుతూ ప్రపంచంలోనే అతిపెద్ద భూసమీకరణ ప్రక్రియ ఏపీలోనే జరిగిందని, వాక్‌ టు వర్క్ అన్నది అమరావతి నినాదమని వివరించారు.

తాజ్ పాలెస్‌లో పారిశ్రామిక వేత్తలకు అమరావతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉండాలని తను విజన్ రూపొందించుకున్నట్లు తెలుపుతూ  2050 నాటికి ప్రపంచంలో బెస్ట్ డెస్టినేషన్‌గా ఉండాలన్నది తమ లక్ష్యమని, దానికనుగుణంగా గడచిన నాలుగేళ్లుగా ఏపీ వృద్ధి నమోదు చేస్తోందని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ వరుసగా అగ్రస్థానంలో నిలిస్తోందని గుర్తు చేసారు.

విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్, బెంగుళూరు- చెన్నై కారిడార్, కర్నూలు- చెన్నై కారిడార్ ఇలా వేర్వేరు ఉత్పత్తి నోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పెట్రో కెమికల్స్, హెల్త్, పర్యాటక, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విధానాలు ఉన్నాయని, అభివృద్ధి చేసిన భూ బ్యాంకు అందుబాటులో ఉందని పారిశ్రామిక వేత్తలకు సీఎం చెప్పారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి ముందుకు వెళ్తున్నామని, భవిష్యత్‌లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.