మాణిక్యాలరావు దీక్ష భగ్నం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ  మాజీ మంత్రి, బీజేపీకి ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లిగూడెంలో  చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం రాత్రి భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా పోలీసు వాహనంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

ఉదయం ఉత్సాహంగా యోగాసనాలు వేసి ఉల్లాసంగా కనిపించిన ఆయన సాయంత్రానికి నీరసపడ్డారు. సోమవారం దీక్షలో కూర్చునే సమయంలో 71 కిలోల బరువు ఉన్న ఆయన మంగళవారం సాయంత్రం 69 కిలోలకు తగ్గారు. మంగళవారం సాయంత్రం నుంచి ఆయన ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. ఒక్కసారిగా బీపీ, బరువు తగ్గడంతో వేగంగా డీహైడ్రేషన్‌ వచ్చే సూచనలు ఉన్నాయని ఆయనకు పరీక్షలు జరిపిన డాక్టర్‌ ప్రసాదరావు చెప్పారు. ఈ పరిస్థితిలో సెలైన్లు ఎక్కించాలని, లేకుంటే ప్రమాదమని వెల్లడించారు. 

కాగా, తన ఆరోగ్యం గురించి ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని  ఎమ్మెల్యే  మాణిక్యాలరావు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం వైద్య పరీక్షల అనంతరం  ఆయన మాట్లాడుతూ . అభివృద్ధి విషయంలో  దొంగ లెక్కలు చెప్పిన విధంగానే ప్రభుత్వం తన వైద్యపరీక్షల రిపోర్టులను తప్పుగా ప్రకటిస్తోందని విమర్శించారు.  మంగళవారం ఉదయం పరీక్షలలో షుగర్‌స్థాయి 70కి పడిపోయిందని అన్నారని, అలా పడిపోవడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. 

సరిగా పరీక్షలు చేయండని అడిగితే తర్వాత షుగర్‌ లెవెల్‌ 128 ఉందని పేర్కొన్నారని విమర్శించారు. రక్తపరీక్షల ఫలితాలనూ తప్పుగా చూపిస్తున్నారని మాణిక్యాలరావు ఆరోపించారు. ప్రభుత్వం నుంచి ఏదైనా స్పష్టమైన హామీ రావాలని, అది వచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు.  

దీక్షను భగ్నం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఏదైనా జరిగితే ప్రజలు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతోసహా బంగాళాఖాతంలో కలిపేస్తారని హెచ్చరించారు. సీఎం ఆరోగ్యం బాగుండాలంటే తన  ఆరోగ్యాన్ని పరిరక్షించాలని హితవు  చెప్పారు.