అగ్రకులాల మధ్య చిచ్చు పెడుతున్న బాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అధికారం కోసం అగ్రకులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. విజయవాడలో భారతీయ యువమోర్చా పదాధికారుల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు నాగోతి రమేష్‌నాయుడు అధ్యక్షతన జరగగా, కన్నా ముఖ్యఅతిధిగా పాల్గొంటూ అనేక రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకుని ప్రధాని మోదీ అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించారని తెలిపారు. 

కానీ చంద్రబాబు తన స్వార్థం కోసం మళ్లీ అగ్ర కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇందులో ఐదు శాతం కోత విధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో మాల, మాదిగల మధ్య, కాపు, బీసీల మధ్య గొడవ పెట్టిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. కాపులకు రిజర్వేషన్‌లు అన్న బాబు కమిటీ పేరుతో కాలయాపన చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 

ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, పోలీసుల అండతో ప్రతిపక్షాలపై భౌతిక దాడులు చేస్తున్నారని కన్నా ఆరోపించారు. తమ ఇంటి మీదకు వచ్చిన వారంతా రౌడీ షీటర్లే అని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని, మరోసారి బాబుకు అవకాశం ఇస్తే ఏపీని, ప్రజలను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. 

ఇలా ఉండగా, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినందున వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ  కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఆయన కుటుంబ సభ్యులపై తిరుపతిలో దాడికి ప్రయత్నం జరిగిందని తెలిపారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్‌ నేత మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోమువీర్రాజు విషయంలోనూ టిడిపి  కార్యకర్తలపరంగా సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు.