కాపులను మభ్యపెట్టడానికే 5 శాతం కోటా

ఎన్నికల ముందు కాపులను మభ్యపెట్టడానికే అగ్ర వర్ణ పేదలకు ఉద్దేశించిన పది శాతం కోటాలో ఐదు శాతం ఇస్తామని చంద్రబాబు నాయుడు ఆశ చూపుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించి, అగ్రవర్ణాల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలుచేస్తే, అందులో 5శాతం వాటాను కాపులకు కేటాయించాలన్న చంద్రబాబు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లదని స్పష్టం చేశారు. 

కాపులు ఈ విషయాన్ని గ్రహించి, చంద్రబాబు ప్రకటనలను నమ్మవద్దని కోరారు.  గతంలో కాపులను బీసీల్లో చేరుస్తామని ప్రకటించి, బీసీ వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కాపులను బీసీల్లో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించిన తీర్మానం పనికిరానిదిగా అభివర్ణించారు.

 ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించడానికి ఏకమవుతున్న విపక్షాల కూటమి తమ ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటించగలవా అని సోము ప్రశ్నించారు. విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయా, మమతా బెనర్జీయా, లేక మాయావతా అని ప్రశ్నించారు. ఈ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నానని చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడుకు దమ్ముంటే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని సవాల్ చేశారు.

 ప్రధాని నరేంద్రమోడీ తనను చూసి భయపడుతున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలను సోము ఎద్దేవాచేశారు. పాకిస్థాన్, చైనా దేశాలకే మోడీ భయపడటం లేదని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. చంద్రబాబే కేసుల భయంతో దేశమంతా తిరుగుతున్నారని ఎద్దేవాచేశారు. జగన్‌పై దాడి కేసును ఎన్‌ఐఏకి అప్పగిస్తే భయపడి కోర్టును ఆశ్రయించారని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడం లేదని చంద్రబాబు ఒకపక్క దుష్ప్రచారం సాగిస్తుంటే ఆయన మంత్రివర్గ సహచరులు కేంద్ర మంత్రులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారని పేర్కొన్నారు. 

దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి కేంద్రం రూ.62వేల కోట్లు మంజూరుచేస్తే, ఏపీ ఒక్క రాష్ట్రానికే రూ.10వేల కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. రాజమహేంద్రవరం రూరల్‌లో ఉపాధి హామీ నిధులతోనే చెరువులు తవ్వి మట్టిని అమ్ముకున్నారని ఆరోపించారు. అందుకే రాష్ట్రానికి మంజూరైన ఫుడ్‌పార్కును ప్రారంభించలేకపోయిందని ధ్వజమెత్తారు. కేంద్రం 10 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే, సబ్సిడీ నిధులు లేక రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఇళ్లనే నిర్మిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర నిధులతోనే కడియంలో ఫ్లోరీకల్చర్ రీసెర్చ్ కేంద్రానికి శంకుస్థాపన జరిగిందని సోము తెలిపారు.