థాకరే స్మారక మందిరానికి రూ.100 కోట్లు

మహారాష్టల్రో బీజేపీ- శివసేన మధ్య అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. దీన్లో భాగంగానే శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే స్మారక మందిరం నిర్మాణానికి రూ  100 కోట్లు మంజూరు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి శివసేనతో సంబంధాలు పునఃరుద్దరించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. 

బాల్ థాకరే జయంతికి నిధులు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి దేవందర్ ఫడ్నవిస్ ప్రభుత్వం నిర్ణయాన్ని శివసేన స్వాగతించింది. బాల్‌థాకరే స్మారక నిర్మాణాన్ని చేపట్టిన ట్రస్ట్‌కు బుధవారం భూమి అప్పగించనున్నారు. మంగళవారం కేబినెట్ సమావేశం ముగిసిన తరువాత రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగాంటివార్ విలేఖరులతో మాట్లాడుతూ ‘బీజేపీ-శివసేన మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పారు. సంకీర్ణ ధర్మాన్ని తాము గౌరవిస్తామని, సేనతో ఎప్పుడూ స్నేహపూరిత సంబంధాలనే కోరుకుంటున్నామని ఆయన వెల్లడించారు. 

కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీకి శివసేన మిత్రపక్షంగా ఉంది. అయితే అప్పుడప్పుడూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ ఇబ్బంది పెడుతోంది. పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే గత ఏడాది చేసిన ప్రకటన కలకలం రేపింది. భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశాలు తక్కువేనని ఉద్ధవ్ పేర్కొన్నారు.

‘దివంగత బాల్‌థాకరే ఒక్క శివసేనకే నాయకుడు కాదు. ఇరుపార్టీలకు ప్రముఖ నాయకుడే. అన్ని పార్టీలూ ఆయనకు అదే గౌరవాన్ని ఇస్తాయి. అందుకే బాల్ థాకరే స్మారక నిర్మాణానికి వంద కోట్ల రూపాయలను కేబినెట్ కేటాయించింది’అని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. శివసేన ఎమ్మెల్యే అనిల్ పరబ్ కేబినెట్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితమే బాల్‌థాకరే స్మారక మందిరం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.