ఈవీఎం రిగ్గింగ్ ఆరోపణపై ఈసీ సీరియస్

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) 2014 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారని సయ్యద్ సుజా అనే వ్యక్తి చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా స్పందించింది. తనను తాను సైబర్‌నిపుణుడిగా చెప్పుకున్న సయ్యద్ సుజాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఒక లేఖలో కోరింది. 

అమెరికాలో రాజకీయ శరణార్థిగా ఉన్నానన్న సయ్యద్ సుజా ప్రజల్లో భయాందోళనలు కలుగజేసే వదంతుల వ్యాప్తి ద్వారా ఐపీసీ సెక్షన్ 505(1)ని ఉల్లంఘించాడని ఈసీ  తెలిపింది. లండన్‌లో సోమవారం జరిగిన ఒక మీడియా సమావేశంలో అమెరికా నుంచి స్కైప్ ద్వారా మాట్లాడిన సయ్యద్ సుజా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని, 2014ఎన్నికల్లో రిగ్గింగ్‌తోనే బీజేపీ గెలిచిందని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

 ఈ ప్రకటనపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుపాలని ఈసీ ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని ఈసీ మరోసారి స్పష్టం చేసింది. ఈవీఎంలను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)తయారు చేస్తాయి. ఈ క్రమంలో అత్యంత భద్రతా ప్రమాణాలు పాటిం చి, అన్ని ప్రామాణిక ప్రక్రియలను పరిశీలిస్తారు. ఈవీఎంల పరిశీలనకు 2010లోనే ఒక అత్యున్నత సాంకేతిక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశాం అని ఈసీ తన లేఖలో పేర్కొంది.

కాగా, స్వయంగా సుజా ప్రెస్ మీట్ లో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ఈ ఆరోపణలపై సర్వత్రా విమర్శలు చెలరేగడంతో ఇప్పుడు మాట మారుస్తున్నారు. సయ్యద్ సుజా చెప్పిన అంశాలన్నీ కాల్పనిక కథలాగా ఉన్నాయని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ అంగీకరించారు. ఆ ఆరోపణల్లోని వాస్తవాలను వెలికితీసే పనిని మీడియా లేదా దర్యాప్తు సంస్థలు చేపట్టాలని అంటూ ఆ మాటలు అభూత కల్పనలని పరోక్షంగా అంగీకరించారు. 

లండన్‌లో జరిగిన మీడియా సమావేశంలో సిబల్ పాల్గొనటంపై బీజేపీ విమర్శలు చేయడంతో దానితో తనకు సంబంధం లేదని చెప్పుకోవడానికి తంటాలు పడుతున్నారు. తాను వ్యక్తిగత పనిమీద లండన్ వెళ్లినట్టు చెప్పుకొస్తున్నారు. 

ఇక ఆ మీడియా సమావేశానికి బీజేపీకి అందినట్టే తనకూ ఆహ్వానం వచ్చిందని చెప్పారు. లండన్ మీడియా సమావేశంలో కపిల్ సిబల్ పాల్గొన్నా, తమకు ఎటువంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ సహితం తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నది. 

మరోవంక, సైబర్ నిపుణుడు సయ్యద్ సుజా తమ వద్ద పనిచేయలేదని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) స్పష్టం చేసింది. 2009-14 వరకు ఈసీఐఎల్‌లో పనిచేసినట్లు ఆయన చెబుతున్నారని, కానీ అది వాస్తవం కాదని పేర్కొంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల రిగ్గింగ్ జరిగిందన్న సుజా ఆరోపణలు అవాస్తమని స్పష్టం చేసింది.