పరాజయంకు సాకులు వెదుక్కొంటున్న విపక్షాలు

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమకు పరాజయం తప్పదని నిర్ధారించుకున్న విపక్షాలు దాని నుంచి తప్పించుకోవడానికి సాకులు వెతుక్కుంటూ ఈవీఎంలపై విమర్శలు ప్రారంభించాయని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ విమర్శించారు. అందుకే విపక్షాల కూటమి పార్టీలు ఒక కమిటీగా ఏర్పడి ఈవీఎంల పాట పాడుతున్నాయని ఎద్దేవా చేశారు. 

బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014లో జరిగిన ఎన్నికల కన్నా తమకు ఈసారి ఎక్కువగా సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న విపక్షాలు మేనిఫెస్టోను తయారు చేయడానికి, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ కోసం కమిటీలను ఏర్పాటు చేయడంలో విఫలమైనా, ఈవీఎంల మీద మాత్రం కమిటీని వేశాయని ఆయన విమర్శించారు. 

వచ్చే ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చిన విపక్షాలు ఓటమిని తప్పించుకోవడానికి సాకుగా ఈవీఎంలను ఎన్నుకున్నాయని ధ్వజమెత్తారు. విపక్షాల కూటమికి నాయకుడు కాని, విజన్ కాని లేవని కాని తమ ప్రభుత్వం కుల, మత, ఉగ్రవాదం, నిరుద్యోగం లేని సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీఏ అభివృద్ధిలో దూసుకుపోతోందని ఆయన తెలిపారు. అందుకే గత ఎన్నికల కన్నా ఈసారి తమకు మరిన్ని సీట్లు వస్తాయన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.