చంద్రబాబు ప్రభుత్వం రుణాలు తీసుకోవడమే పెద్ద కుంభకోణం

ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి కోసం రుణాలు తీసుకోవడంలో తప్పులేదని, కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం  అలా జరగడం లేదని రాజ్యసభ సభ్యుడు, బిజెపి నేత జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. నిధులను దుర్వినియోగం చేస్తూ తాత్కాలిక గృహాలకే పరిమితం అవుతున్నారని తీవ్రంగా దయ్యబడుతు ప్రభుత్వం రుణాలు తీసుకోవడమే పెద్ద కుంభకోణమని ఆరోపించారు. అందుకే లెక్కలు చెప్పేందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేసారు.

ప్రజా సమస్యలను పక్కన పెట్టి ప్రజా ధనంతో చంద్రబాబు ప్రభుత్వం దొంగ పోరాటాలు చేస్తోందని ధ్వజమెత్తారు. తమ సమస్యల పరష్కారానికి విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌తో కలిసి ఆయన పాల్గొంటూ  అమరావతి అభివృద్ధి పేరుతో వెయ్యి ఖర్చు అయ్యే చోట పదివేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ రూపంలో దాబును పార్టీ ఫండ్ లోకి మారుస్తున్నరనే అనుమానం తమకు ఉన్నదని పేర్కొన్నారు. ‘ప్రతి ఒక్కరూ దీన్ని గమనిస్తున్నారు.. మీకు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. మీరు చేసే ప్రతిపనిపైనా జాతీయ స్థాయిలో మా నిఘా కూడా ఉంటుంద’ని తెలుగు దేశం ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

టీడీపీ ప్రభుత్వానికి విలాసాల మీద ఉన్న ధ్యాస వికాసంపై లేదని దుయ్యబట్టారు. స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థల అధిపతి మంత్రిగా ఉన్నారని చెప్పారు. ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసన్నారు.

ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ దీన్ని తరిమికొట్టేలా ఉపాధ్యాయలు కలిసికట్టుగా ఉద్యమించాలని పిలుపిచ్చారు. విదేశీ పర్యటనల పేరుతో విలాసాలకు చేసినంత ఖర్చు కూడా ఈ ప్రభుత్వం విద్యా అభివృద్ధికి కేటాయించడం లేదని విమర్శించారు. ఉపాధ్యాయులు చేస్తున్న డిమాండ్‌లు న్యాయమైనవని అంటూ మద్దతు ప్రకటించారు. పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకం నిధులు కూడా పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు