కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రూ.4.50 లక్షల కోట్లు ఆవిరే !

 కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో దేశంలో దారుణంగా అవినీతి జరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి మండిపడ్డారు. అవినీతికి అడ్డు కట్ట వేసిన తమ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లల్లో రూ 4.50 లక్షల కోట్ల మేరకు నిధులు ఆవిరై పోకుండా కాపాడినదని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగి ఉంటే ఈ మొత్తం అవినీతిపాలయి ఉండేదని చెప్పారు.

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ ఓసారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలోనూ కేవలం 15 పైసలు మాత్రమే అసలైన లబ్ధిదారులకు చేరుతోందని చెప్పిన మాటలను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. సమస్యను గుర్తించినా గత 15 ఏళ్లుగా అవినీతిని అరికట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎటువంటి  కృషి చేయలేదని విమర్శించారు. తన నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ళలో అవినీతిని అరికట్టడంలో విజయం సాధించిందని, దేశంలో పరిపాలన విధానాన్ని మార్చిందని పేర్కొన్నారు. 

15వ ప్రవాసీ భారతీయ దివస్‌ను మోదీ మంగళవారం వారణాసిలో ప్రారంభిస్తూ మాజీ ప్రధాని ఒకరు చెప్పిన మాటలను ఉటకించారు. ‘‘అవినీతి గురించి ఓ మాజీ ప్రధాన మంత్రి (రాజీవ్ గాంధీ) చెప్పిన మాటలను మీరు వినే ఉంటారు. ఢిల్లీ నుంచి పంపించే రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే గ్రామాలకు చేరుతోందని, 85 పైసలు మాయమైపోతోందని ఆయన (రాజీవ్) చెప్పారు. చాలా సంవత్సరాలపాటు దేశాన్ని పరిపాలించిన ఆ పార్టీ దీనిని అంగీకరించింది’’ అని మోదీ చెప్పారు.

వివిధ పథకాల ద్వారా తన ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.5.80 లక్షల కోట్లు జమ చేసిందని మోదీ చెప్పారు. ‘‘గత పద్ధతిలోనే దేశం నడచి ఉండి ఉంటే ఎలా ఉండేదో ఊహించండి. ఆ ప్రభుత్వమే ఉండి ఉంటే రూ.4.50 లక్షల కోట్లు మాయమైపోయి ఉండేది’’ అని తెలిపారు.