ఓటమి తధ్యం కావడంతో ఈవీఎం వివాదం రేపుతున్న కాంగ్రెస్ !

మరో రెండు నెలలో జరుగనున్న ఎన్నికలలో సహితం తమకు ఓటమి తప్పదని, నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని గ్రహించిన కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఈవీఎంలపై మరోసారి వివాదం రేపే ప్రయత్నం చేస్తున్నాయి. వాటి వల్లనే తాము ఓడిపోయామని ఎన్నికల తర్వాత చెప్పుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. 

 2014 ఎన్నికలలో మోదీ ఈవీఎం లను రిగ్గింగ్ చేయడం ద్వారానే అధికారంలోకి వచ్చినదని అంటూ ఇప్పుడు ఎన్నికల ముందు భారత దేశానికి చెందిన సైబర్ నిపుణుడు ఒకరు అమెరికాలో ఉంటూ లండన్ నుండి స్కైప్ లో మీద ముందు సంచలన ఆరోపణలు చేయడం ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నది. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ పాల్గొనడం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని రేకెక్తినుంచే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడి అవుతున్నది. 

'రెండు రోజుల క్రితం కలకత్తాలో జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశంలో కూడా ఈవీఎం లపై వివాదం రేపడం కోసం నలుగురు సభ్యుల కమిటీ వేయడం, త్వరలో ఎన్నికల కమీషన్ ను కలసి వినతి పత్రం ఇవ్వాలని కోవడం గమనార్హం. 

2014 ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేసి బీజేపీ గెలిచిందన్న సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా ఆరోపణలను బీజేపీ తీవ్రంగా తిప్పికొట్టింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓడిపోవడం ఖాయమని తెలిసి ఇప్పటి నుంచే కాంగ్రెస్ ఓ సాకును వెతుక్కుంటున్నదని బీజేపీ విమర్శించింది.  దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు ఈసీ ఫిర్యాదు చేసింది. 

ఈవీఎం హ్యాకింగ్ విషయం తెలిసి తన స్నేహితుల్లో కొంతమందిని చంపేశారని, అందుకే తాను భయపడి ఇండియా నుంచి పారిపోయి వచ్చాననీ అతను చెప్పాడు. అయితే ఇవన్నీ కాంగ్రెస్ ప్రేరేపిత ఆరోపణలని బీజేపీ కొట్టి పారేసింది. 

అసలు ఆ ఈవెంట్‌ను నిర్వహించిన ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆశిశ్ రే కాంగ్రెస్ వ్యక్తి అని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లండన్ వెళ్ళినపుడు ఆయన ప్రయాణానికి అశిష్ స్పాన్సర్ చేశారని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆరోపించారు.  నేషనల్ హెరాల్డ్ పత్రికకు చురుకైన కంట్రిబ్యూటర్‌గా అశిష్ వ్యవహరిస్తున్నారని కూడా చెప్పారు. రాహుల్ గాంధీని అశిష్ ట్వీట్లలో పొగిడిన సందర్భాలను కూడా ప్రస్తావించారు.

అంతేకాదు ఆ ఈవెంట్‌లో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌కు ఏం పని అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. సిబల్ అక్కడేం చేస్తున్నారు? ఏ హోదాలో ఆయన అక్కడున్నారు? అని ఇలదీశారు. 2014 సాధారణ ఎన్నికలు జరిగినపుడు యూపీయే ప్రభుత్వం అధికారంలో ఉందని, ఈవీఎంలను విమర్శించేవారు కూడా వాటిని ఉపయోగించి జరిగిన ఎన్నికల్లో గెలిచారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ తరఫున ఆ ఈవెంట్‌ను ఆయన మానిటర్ చేస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల సంఘాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నమిది అని ఆయన విమర్శించారు. 1996లోనే ఈవీఎంలు వచ్చాయని, అప్పటి నుంచీ బీజేపీయేతర పార్టీలు ఎన్నో ఎన్నికల్లో గెలిచాయని ఆయన అన్నారు. బీజేపీ గెలిస్తే ఈవీఎంలపై ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు.  

ఇలా ఉండగా, ఈవీఎంలను తారుమారు చేస్తానని సవాల్ విసిరిన సయ్యద్ షుజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. షుజా చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి, తగిన దర్యాప్తు చేపట్టాలని కోరుతూ దిల్లీ పోలీసులకు ఈసీ లేఖ రాసింది.