టిడిపికి షాక్ .. వైసిపిలో రాజంపేట ఎమ్మెల్యే మేడా

ఎన్నికల వేల తెలుగు దేశం పార్టీకి కడప జిల్లాల్లో షాక్ తగిలింది. జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసిపి గూటికి చేరారు. ఈనెల 31న అధికారికంగా ఆపార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైసిపి అధినేత జగనా మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్న మల్లికార్జున రెడ్డి తాజా పరిణామాలపై ఆయనతో చర్చించారు. 

అసెంబ్లీ ఎన్నికల వేళ మేడా పార్టీ మారడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, వచ్చే ఎన్నికల్లో మల్లికార్జునరెడ్డి బదులు ఆయన సోదరుడు రఘునాథరెడ్డి రాజంపేట అభ్యర్థిగా పోటీ చేస్తారని  తెలుస్తున్నది. 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన మేడా.. కడప జిల్లా నుంచి టిడిపి  తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. ఆమేరకు తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకు మంచి గుర్తింపు ఇచ్చింది. 

తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ విప్‌ పదవి, ఆయన తండ్రికి టిడిపి పాలకమండలి సభ్యత్యం ఇచ్చింది. అయితే వైసిపి నుండి వచ్చి జిల్లా నుండి మంత్రిపదవి పొందిన రామసుబ్బారెడ్డి తో పొసగటం లేదు. 

జగన్‌తో భేటీ అనంతరం మల్లికార్జునరెడ్డి వైసిపిలో  చేరినట్టు మేడా చెప్పారు. టిడిపిలో నాలుగున్నరేళ్లు ఎన్నోఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు.  రైతులు, డ్వాక్రా మహిళలకు రుణామాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు భృతి ఇస్తానని, కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని నమ్మించి ద్రోహం చేశారని విమర్శించారు. చంద్రబాబు చెప్పేది ఒకటి .. చేసేది మరొకటి అంటూ  ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. 

టీడీపీ నుంచి వైసీపీకి రావడం.. గంజాయి వనంలో నుంచి తులసి వనంలోకి వచ్చినంత ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. జగన్ ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వారని, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జగన్ నడుచుకుంటున్నారంటూ కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి స్పూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.  ప్రజలకు న్యాయం, సేవ చేయాలన్నదే తన ధ్యేయమని తెలిపారు.  ప్రజలు గెలిపించిన కారణంగానే ఇంతకాలం కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ, నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో కొనసాగానని చెప్పారు. 

ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశానని, బుధవారం స్పీకర్‌కు తన లేఖ పంపిస్తానని తెలిపారు. ఈ నెల 30న వై.ఎస్.జగన్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్టు మేడా ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని ఓడించి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  కాగా, ఆయనను టిడిపి నుండి మంగళవారం ఉదయమే సస్పెండ్ చేశారు.