మమతా ర్యాలీలో 9 మంది ప్రధాని అభ్యర్థులు... అమిత్ షా

20-25 మంది నేతలు కలసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఓడించలేరని బిజెపి అధ్యక్షుడు  అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధానికి 100 కోట్ల మంది ప్రజల మద్దతు ఉన్నదాని భరోసా వ్యక్తం చేశారు. `మోడీ వ్యతిరేక కూటమి'గా ప్రతిపక్ష నేతలు ఒకే వేదికపైకి వస్తున్నారని అంటూ మమతా బెనర్జీ జరిపిన ప్రతిపక్ష నేతల ర్యాలీలో తొమ్మిది మంది ప్రధాన మంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు.

"బెంగాల్ ను కాపాడండి - ప్రజాస్వామ్యాన్ని రక్షించండి' నినాదంతో పశ్చిమ బెంగాల్ లోని మాల్దాలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఈ ఘటబంధన్ ఎందుకని ప్రశ్నించారు. అధికారం, స్వప్రయోజనాలకోసం వారంతా ఒకటి అవుతున్నారని ధ్వజమెత్తుతూ వారంతా `వందే మాతరం', `భారత్ మాత కి జై' అని అన్నారా అని అడిగారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికలు దేశ భవిష్యత్తుతోపాటు పశ్చిమబెంగాల్‌ భవిష్యత్తును నిర్ధారించనున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం బెంగాల్‌లో ఉంటుందా, కూకటి వేళ్లతో పెకిలించుకుపోతుందా అనేది 2019 ఎన్నికల్లో తేలిపోతుందని స్పష్టం చేశారు. రాజకీయాల పేరుతో మమతా బెనర్జీ ప్రభుత్వం జనహననం సాగిస్తోందని ఆమె పాలనపై నిప్పులు చెరిగారు. టీఎంసీ నిరంకుశ పాలన నుంచి బెంగాల్‌కు రాబోయే ఎన్నికలతో విముక్తి కల్పించబోతోందని చెప్పారు. 

 మోదీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేస్తుంటే, సొంత అభివృద్ధికి మహాకూటమి ప్రయత్నాలు చేస్తోందని మండి పడ్డారు. మోదీని గద్దెదింపడమే మహాకూటమి ఏకైక లక్ష్యంగా మారిందని చెబుతూ మహాకూటమిలోని నేతలంతా బలమైన ప్రభుత్వాన్ని కాకుండా బలహీన ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని చురకలు వేశారు.

బీజేపీ ప్రతిపాదిత రథయాత్రాలకు మమతా బెనర్జీ మోకాలడ్డడంపై విరుచుకుపడుతూ తాము ఎక్కడ వైఫల్యం చెందుతామోనన్న భయంతోనే ర్యాలీలకు ముఖ్యమంత్రి అనుమతించడం లేదని ఆరోపించారు. రథయాత్రలను అడ్డుకోవడం ద్వారా ప్రజల హృదయాల్లోని కమలవికాసాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.

ఒకప్పుడు ప్రగతిలో దేశంలో ముందంజలో ఉండే బెంగాల్ ఇప్పుడు వెనుకబడి పోయినదని అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకన్నా బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు 49 శాతం తక్కువగా కరువు భత్యం పొందుతున్నారని చెబుతూ డబ్బంతా ఎక్కడికి పోతున్నదని నిలదీశారు. మమతా పాలనతో ప్రజలు విసుగు చెందారని పేర్కొంటూ ఆమె కన్నా  వామపక్షాల పాలన మెరుగనుకోవడం ప్రజలు ప్రారంభించారని విరుచుకు పడ్డారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 2.5 రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చిందని, అయితే చొరబాటుదారులు సగం, తక్కిన సగం టీఎంసీ నేతలు బొక్కేశారని అమిత్‌షా తీవ్ర ఆరోపణలు చేశారు. కమ్యూనిస్టులను గద్దెదింపిన పశ్చిమబెంగాల్ ప్రజలు టీఎంసీని కూడా ఓటుతో అధికారం నుంచి దింపగలిగే శక్తివంతులని భరోసా వ్యక్తం చేశారు.

కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడేలా నరేంద్ర మోదీకి ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్‌సీ)ను టీఎంసీ అడ్డుకుంటోందని, చొరబాటుదారులకు మద్దతిస్తోందని అమిత్‌షా ఆరోపించారు. బీజేపీకి అధికారమిస్తే చొరబాటుదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్‌లోకి అడుగుపెట్టనీయమని తాను హామీ ఇస్తున్నానని అమిత్‌షా తెలిపారు.