మాణిక్యాలరావు నిరవధిక నిరాహార దీక్ష

అభివృద్ధి విషయంలో జిల్లాకు, తన నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చనందుకు నిరసనగా మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరంలో ఆయన నిరాహారదీక్షకు కూర్చున్నారు.

ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతిచ్చి అన్ని స్థానాలను గెలిపించిన పశ్చిమ గోదావరి జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీరని ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని మెడలు వంచి నిరవధిక నిరాహారదీక్ష ద్వారా ప్రజల మద్దతుతో హామీలు సాధించుకుంటామని స్పష్టం చేశారు. హామీల అమలు కోసం పొట్టిశ్రీరాములు స్ఫూర్తితో ప్రాణత్యాగానికైనా సిద్ధమని వెల్లడి చేశారు.

విమానాశ్రయ భూముల్లో నిర్వాసితులకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు గెలిపించారని, ఈ జిల్లాకు ఎంతో రుణపడి ఉన్నానని ఏకార్యక్రమాన్నైనా ఇక్కడి నుంచి ప్రారంభిస్తానని చెప్పిన చంద్రబాబు 4 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని, హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. సుదూర సముద్ర తీరం ఉన్న జిల్లాకు కనీసం ఒక్క షిప్పింగ్ హార్బర్‌కానీ, ఆక్వాపార్కుకానీ, విశ్వవిద్యాలయంగానీ, యువత ఉపాధికి తోడ్పడే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సంస్థలు, ఇతర పరిశ్రమలు కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు.

చంద్రబాబు పాలన దోపిడీ రాజ్యం, దొంగల ప్రభుత్వంగా మారిందని కార్యాక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ సమన్వయకర్త పురిఘళ్ల రఘురామ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు, టీడీపీ నేతలు దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నా రాష్ట్రానికి ఏమీ ఇవ్వడంలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి.రవీంద్రరాజు కూడా పాల్గొన్నారు.