మతిస్థిమితం కోల్పోయిన చంద్రబాబు

భూదాహంతో వేలాది ఎకరాల భూములను సమీకరించి లక్షల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపిస్తూ ప్రస్తుతం ఎక్కడ కటకటాలు లెక్కించాల్సి వస్తుందోనన్న భయంతో మతిస్థిమితం కోల్పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమి మాట్లాడుతున్నారో ఏమి చేస్తున్నారో ఆయనకే అర్థం కావటం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఇలాంటి మతిస్థిమితం లేని ముఖ్యమంత్రి మనకు వద్దని స్పష్టం చేశారు. భూదాహం, ధనదాహం, ఆపై భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి నిద్ర లేచినప్పటి నుంచి ప్రధాని మోదీని, కేంద్రాన్ని నిందిస్తున్నారని మండిపడ్డారు.

విజయవాడలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలోమాట్లాడుతూ వివిధ పథకాల కింద కేంద్రం ఇప్పటికే దాదాపు రూ. 10 లక్షల కోట్లు పైగా ఇవ్వగా కాంట్రాక్టర్‌ల నుంచి కోట్లాది రూపాయలు కమీషన్‌లు తీసుకుంటునే కేంద్రం నయాపైసా ఇవ్వడం లేదంటూ చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్భ్రావృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేస్తూ బాబు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖకు కేంద్రం నుంచి రూ. 24వేల కోట్లు ఇచ్చిన విషయం మరిచారా అని ప్రశ్నించారు.

గతంలో పోలవరం ప్రాజెక్టు సందర్శనానికి వచ్చినప్పుడు ఏడు వేల కోట్లు విలువైన పోర్టు పనులకు శంకుస్థాపన చేయగా నేడు రూ. 16, 800 కోట్లు విలువైన రహదారి పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభం, శంకుస్థాపన చేస్తున్నారంటూ కన్నా ప్రశంసించారు.

బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఇన్‌చార్జి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో నేడు కేంద్ర స్కీంలు, టిడిపి స్కాంలు మాత్రమే ప్రతి ఒక్కరికీ కన్పిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నారని చెబుతూ రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లిపోయినందునే ప్రజలు నీతివంత పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. ఇక పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తాను ఎంతో శ్రమించి కడుతున్నట్లుగా చౌకబారు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.

శాసనసభలో బీజేపీ పక్షనేత పెనె్మత్స విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు సాగిస్తున్న అసత్య ప్రచారాలు సమర్థవంతంగా తిప్పికొట్టాలంటూ పిలుపునిచ్చారు. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటూనే ఏమీ ఇవ్వడం లేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దోపిడీ ద్వారానే రెండు వేల కోట్ల రూపాయలు టీడీపీ నేతలు దోచుకున్నారని తెలిపారు. విశాఖలో 2080 ఎకరాల భూమి కబ్జా చేయగా దీనిపై ప్రభుత్వం నియమించిన ‘సిట్’ దర్యాప్తు నివేదికను మాత్రం బహిర్గతం చేయడం లేదని విమరిశలు. ముదపాకలో వెయ్యి కోట్ల విలువైన భూముల కుంభకోణాన్ని కూడా పార్టీ తరపున తానే శాసనసభలో ప్రస్తావించి ప్రజల దృష్టికి తీసుకువచ్చానని గుర్తు చేశారు.