అమిత్ షా హెలికాప్టరు ల్యాండింగుకు మమతా అడ్డు !

దేశ ప్రధాని కావాలని కలలు కంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో బిజెపి ఉనికి చూసి భయపడుతున్నారు. బీజేపీ చేపట్టిన మూడు రధ యాత్రలకు అనుమతి నిరాకరించిన ఆమె ప్రభుత్వం తాజాగా చివరకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా దిగవలసిన హెలికాప్టరు ల్యాండింగుకు కూడా అనుమతి ఇవ్వడానికి వెనుకడుగు వేశారు.

స్వైన్ ఫ్లూ జ్వరం నుంచి కోలుకున్న బీజేపీ అధినేత అమిత్ షా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో ఈ మంగళవారం జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు విమానంలో కోలకతాకు వచ్చి అక్కడి నుంచి బీజేపీ కార్యకర్తల ర్యాలీలో పాల్గొనేందుకు మాల్దాకు హెలికాప్టరులో రావాలనుకున్నారు.

ఈ మేరకు వీవీఐపీ హెలికాప్టర్ మాల్దాలో ల్యాండింగ్ కోసం అనుమతించాలని మాల్దా జిల్లా అధికారులకు బీజేపీ నేతలు కోరారు. తమ పీడబ్ల్యూడీ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నివేదిక ప్రకారం మాల్దా హెలిపాడ్ హెలికాప్టరు దిగేందుకు అనువుగా లేదని, అక్కడ ఇసుక, నిర్మాణ సామాగ్రి ఉన్నాయని జిల్లా అదనపు మెజిస్ట్రేట్ బీజేపీ నేతలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

తాత్కాలిక హెలిపాడ్‌లో కూడా నిర్మాణ పనులు చేపట్టినందున అమిత్ షా హెలికాప్టరు దిగేందుకు సురక్షితం కాదని అందుకే తాము హెలికాప్టరు ల్యాండింగుకు అనుమతించడం లేదని మాల్దా జిల్లా అదనపు మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు.అయితే అధికారుల వాదనను బిజెపి నాయకులు కొట్టి పారవేస్తున్నారు. గత వారమే అక్కడ హెలికాఫ్టర్ వచ్చిన్నట్లు చెబుతున్నారు.

హోటల్ గోల్డెన్ పార్క్ కు ఎదురుగా గల ఖాళీ స్థలంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగే చోట బిజెపి అనుమతి కోరగా అక్కడ మరమత్తులు జరుగుతున్నాయనే సాకుతో జిల్లా అధికారులు ఇవ్వలేదు. అయితే  అక్కడ పనులు పూర్తయ్యాయని, దానిని హెలికాఫ్టర్లు దిగడానికి వాడుతున్నారని స్థానిక బీజేపీ నేతలు స్పష్టం చేయడంతో ఇవ్వక తప్పలేదు. తమకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండడంతో అనుమతి ఇస్తున్నామని అంటూ మమతా తర్వాత గొప్పగా చెప్పుకున్నారు.

తప్పుడు కారణాలతో అనుమతి నిరాకరించి, మమతా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆరోపించారు.

రెండు రోజుల పశ్చిమ బెంగాల్ పర్యటనలో మంగళవారం మాల్దాలో, బుధవారం ఝార్గ్రామ్ లో జరిగే బహిరంగ సభలలో ప్రసంగిస్తున్నట్లు అమిత్  ఒక ట్వీట్ లో తెలిపారు. మమతా సంతృప్తికరణ రాజకీయాలు ధ్వంసం చేసిన `బెంగాల్ గౌరవం'ను నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి పునరుద్ధరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

 

,