పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అదే దూకుడు

అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న టీఆర్‌ఎస్.. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే దూకుడు కొనసాగించింది. అనేక జిల్లాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు క్లీన్‌స్వీప్‌చేశారు. సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏకపక్షంగానే వచ్చింది.

తొలి విడుతలో భాగంగా 3701 పంచాయతీలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. మరో 769 గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా 4470 గ్రామపంచాయతీలకుగాను కడపటి సమాచారం అందేసరికి టీఆర్‌ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవాలు కలుపుకొని 2973 పంచాయతీల్లో విజయకేతనం ఎగురవేశారు.

ద్వితీయ స్థానంలో కాంగ్రెస్ బలపర్చిన 911 మంది అభ్యర్థులు, తెలుగుదేశం బలపర్చిన 30 మంది, బిజెపి బలపరిచిన అభ్యర్థులు 67 మంది, సిపిఐ బలపర్చిన 19 మంది, సిపిఎం బలపర్చిన 32 మంది అభ్యర్థులు గెలుపొందారు. ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా నిలబడిన 756 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.

కొద్దిరోజుల క్రితమే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటింగ్‌కు తరలి వచ్చిన గ్రామీణ ఓటర్లు.. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే స్ఫూర్తిని చాటారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఓటేసేందుకు బారులు తీరారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే అనేకమంది తమ సొంతూరికి వెళ్లి మరీ ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో ఉదయం 9 గంటల వరకు 27%, 11 గంటల వరకు 60% నమోదైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంటవరకు 85.76 శాతంగా నమోదైంది.

పలు గ్రామాల్లో 90 శాతానికి మించి పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, తొలుత వార్డు స్థానాలకు ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత సర్పంచ్ స్థానాల లెక్కింపు ప్రారంభించారు. సర్పంచ్ అభ్యర్థుల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు ముందు నుంచీ మెజార్టీతో ఉన్నారు.

పంచాయతీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవటం విశేషం. ఏకగ్రీవాలు పోను సోమవారం ఎన్నికలు జరిగిన 3,701 గ్రామాల్లో మొత్తం 48,46,443 ఓటర్లున్నారు. అందులో 23,96,965 మంది పురుష ఓటర్లు, 24,49,361 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం 41,56,414 ఓట్లు పోలవ్వగా.. 20,36,782 మంది పురుషులు, 21,19,624 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఓటింగ్‌లో మహిళల ఓట్లు 86.54%, పురుషుల ఓట్లు 84.97% ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.