ఏపీ చరిత్రలో మోదీ పాలన స్వర్ణ యుగం... గడ్కరీ

నాలుగున్నరేళ్లలో కేంద్రం లోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు ఎంతో చేసిందని చెబుతూ ఏపీ చరిత్రలో ఇదో స్వర్ణయుగం అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇస్తున్నా వాటిని దుర్వినియోగం చేసి రూపాయి కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.

విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన కృష్ణా జిల్లా, విజయవాడ నగర బిజెపి  ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని తన వ్యక్తిగత బాధ్యతగా స్వీకరిస్తానని గడ్కరీ హామీ ఇచ్చారు. పోలవరానికి 100శాతం నిధులు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ అందించిన సాయం మరెవరూ అందించలేదని చెబుతూ కేంద్ర ప్రభుత్వం  ఏపీకి ఇస్తున్న నిధులు, అమలు చేస్తున్న పథకాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వంకు సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పోలవరం పనులు 62 శాతం పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం విషయంలో కేంద్రం ఘనతను రాష్ట్రం ఎందుకు ఒప్పుకోవడం లేదో తెలియడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధోరణిపై అసహనం వ్యక్తం చేశారు.

బిజెపి ఏ మతానికీ వ్యతిరేకం కాదని.. తీవ్రవాదానికి మాత్రమే వ్యతిరేకమని తెలిపారు. ఏపీ అభివృద్ధి పట్ల ఎలాంటి వివక్ష, విద్వేషం లేదని స్పష్టం చేశారు. ఏపీ దేశంలోనే నెం.1గా ఎదిగేందుకు సహకరిస్మని భరోసా ఇచ్చారు. రాజకీయాలు ఎలా ఉన్నా రాష్ట్ర అభివృద్ధికి తన మద్దతు ఉంటుందని గడ్కరీ హామీ ఇచ్చారు.

సరైన రోడ్లు లేకపోతే పరిశ్రమలు రావు. అభివృద్ధి జరగదని చెబుతూ జాతీయ రహదారులు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయని చెప్పారు. విశాఖపట్నం పోర్టు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని గడ్కరీ తెలిపారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌తో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఏపీలో 1708 కి.మీ జల రవాణా వ్యవస్థ అభివృద్ధికి ఇప్పటికే ఆమోదం తెలిపామని వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్ దినదినాభివృద్ధి చెందుతుందని.. ఇక్కడి రైతులు, ప్రజలు దేశానికి ఆదర్శమని గడ్కరీ కొనియాడారు. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మిస్తామని, పోర్టుల కోసం రూ.1.64లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. 

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకే 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లు కల్పించామని గడ్కరీ తెలిపారు. ఈ రిజర్వేషన్లతో ఎంతో మంది పేదలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారన్నారు. బీజేపీ కుటంబ పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ. యాబై ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ ఐదేళ్ల కాలంలో జరిగిందని చెప్పారు.