స్వామీజీ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

కర్ణాటకలోని సిద్ధగంగా మఠాధిపతి డాక్టర్‌ శివకుమార స్వామీజీ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా ఎంతో మంది ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. 111ఏళ్ల స్వామీజీ అనారోగ్యంతో గత రెండు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు.

స్వామీజీ మృతితో విషాదంలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, బిజెపి  నేత యడ్యూరప్ప రాజకీయ విబేధాలు పక్కన పెట్టి కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్వామీజీకి గతంలో పద్మ భూషణ్‌ అవార్డు లభించింది. రేపు స్వామీజీ అంత్యక్రియలు జరగనున్నాయి. తుమకూర్‌లోని మఠానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

‘ఆధ్యాత్మిక వేత్త అయిన శివకుమార స్వామీజీ మరణం ఎంతో బాధించింది. విద్య, వైద్య రంగాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. అసంఖ్యాకులైన ఆయన అనుచరులకు సంతాపం తెలియజేస్తున్నా’ అని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ సంతాప సందేశంలో పేర్కొన్నారు.

గతంలో గతంలో సిద్ధగంగా మఠాన్ని సందర్శించి శివకుమార స్వామీజీ ఆశీర్వాదం తీసుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన సమాజానికి ఎంతో సేవ చేశారని ఘనంగా నివాళులు అర్పించారు.

‘శివకుమార స్వామీజీ మరణ వార్త వినడం చాలా బాధాకరం. కోట్లాది మంది భారతీయులు, అన్ని వర్గాలు, మతాల ప్రజలు ఆయనను ఎంతో గౌరవిస్తారు. ఆయన లేకపోవడం ఆధ్మాత్మికంగా ఎంతో లోటు. ఆయన అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి’  అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాప సందేశంలో పేర్కొన్నారు.

‘శివకుమార స్వామీజీకి భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నా. ఆ బిరుదుకు ఆయన చాలా అర్హత గల వ్యక్తి. కర్ణాటకకు చెందిన చాలా గొప్ప వ్యక్తి’ అని లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు.

పీఠం బాధ్యతలు స్వీకరించిన స్వామి తొలినాళ్లలోనే విద్య ప్రాముఖ్యతను గుర్తించారు. అందుకనుగుణంగా అనేక విద్యాసంస్థలను పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. కేవలం లింగాయతులకే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాల విద్యార్థులకు ఈ విద్యాసంస్థల్లో ప్రవేశం కల్పించారు.

కర్ణాటకలో కులాల వారీగా మఠాలున్నాయి. అయితే సిద్ధగంగ పీఠంలో అందరిని సమానంగా చూసేవారు. స్వామిని దర్శించుకునేందుకు అన్ని రాజకీయపక్షాలకు చెందిన వివిధ వర్గాల నేతలు వచ్చేవారు. ఆయన ఎప్పుడూ ఏ రాజకీయపక్షం వైపు మొగ్గుచూపకుండా తటస్థంగా వ్యవహరించేవారు.

1930లో పీఠాధిపతిగా సారథ్యం స్వీకరించిన అనంతరం మఠానికి ఆర్థికవనరులు తక్కువగా ఉండేవి. అయినా వెనుకంజ వేయకుండా విద్యాసంస్థలను ఏర్పాటుచేసి లక్షలాదిమంది విద్యార్థులకు అండగా నిలిచారు. ఇంజినీరింగ్‌, వైద్య, నర్సింగ్‌, ఫార్మసీ, ఉపాధ్యాయశిక్షణ కళాశాలతో పాటు అనేక ప్రాధమిక పాఠశాలలను ఏర్పాటుచేశారు. విద్యాసంస్థలకుచెందిన విద్యార్థులకు ఉచిత భోజనం కూడా అందించడం విశేషం.

శివకుమారస్వామి నిరాడంబరత, సమాజసేవకు ప్రాధాన్యమిచ్చారు. నిత్యం భక్తులకు దర్శనమిచ్చేవారు. మఠం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు పళ్లు, కూరగాయలు మఠానికి భక్తితో ఇచ్చేవారు. ఆయన మఠాధిపతిగా పగ్గాలు అందుకున్న సమయంలో 200 మంది విద్యార్థులుండగా నేడు ఆ సంఖ్య దాదాపు 10000కు చేరింది. కుల రహిత సమాజం నెలకొల్పాలన్నదే లింగాయత మత వ్యవస్థాపకుడు బసవన్న ఆశయం. ఆ ఆశయాన్ని నెరవెర్చేందుకు శివకుమార స్వామి నిరంతరం కృషి చేశారు.