రాహుల్ గాంధీకి ఆహ్వానం పంపనున్న ఆరెస్సెస్‌

కరడు గట్టిన కాంగ్రెస్ వాది అయిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీని తమ కార్యక్రమంకు ముఖ్యఅతిధిగా ఆహ్వానించి ఇంతకు ముందు సంచలనం కలిగించిన ఆరెస్సెస్‌ ఇప్పుడు నిత్యం తమను ఘాటుగా విమర్శిస్తున్న కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీకి ఆహ్వానం పంపి మరో సంచలనానికి కేంద్రం కాబోతున్నట్లు తెలిసింది. సెప్టెంబర్‌ 17 నుంచి 19 వరకు ఢిల్లీలో ఆరెస్సెస్‌ నిర్వహించనున్న ఒక కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్నట్టు తెలిసింది. అంతేకాకుండా తమపై నిత్యం తీవ్ర విమర్శలు చేసే  సీపీఎంకు చెందిన సీతారాం ఏచూరితో పాటు మరికొందరు ప్రతిపక్ష నాయకులను కూడా ఈ కార్యక్రమానికి పిలవనున్నట్టుగా తెలుస్తోంది. దీ

సెప్టెంబర్‌లో జరిగే ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించనున్నట్టు ఆరెస్సెస్‌ అధికార ప్రతినిధి అరుణ్‌ కుమార్‌ ధ్రువీకరించారు. తెలిపారు. ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అధ్యక్షత వహించనున్నారు. నాగపూర్‌లో ఆర్‌స్సెస్‌ కార్యక్రమానికి ప్రణబ్‌ ముఖర్జీ హాజరవ్వడంపై రాహుల్ గాంధీ అధికారికంగా స్పందించలేదు. కానీ  పలువురు కాంగ్రెస్‌ నేతలు మాత్రం ప్రణబ్‌ ఆరెస్సెస్‌ కార్యక్రమానికి వెళ్లడంపై సోషల్‌ మీడియాలో తమ అసంతృప్తిని తెలియజేశారు.

అయితే ఆ కార్యక్రమంలో ప్రణబ్‌ చేసిన ప్రసంగాన్ని పలువురు కాంగ్రెస్‌ నేతలు స్వాగతించారు.  ఆరెస్సెస్‌పై ఇటీవలి కాలంలో రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐరోపా పర్యటనలో భాగంగా రాహుల్‌ మాట్లాడుతూ ఆరెస్సెస్‌ను అరబ్‌ దేశాల్లోని రాడికల్‌ ఇస్లామిస్టు గ్రూపు ముస్లిం బ్రదర్‌హుడ్‌తో పోల్చారు. పైగా తనపై నిత్యం ఆరెస్సెస్‌ చేస్తున్న విమర్శల కారణంగానే తాను నాయకుడిగా ఎదగ గలుగుతున్నానని కుడా చెప్పారు. వచ్చే ఎన్నికలు ఆరెస్సెస్‌, బిజెపి భావజాలానికి వ్యతిరేకంగా జరుగుతున్నవని కుడా పేర్కొన్నారు.